ఒరాకిల్ కు ఆమె దెబ్బ
న్యూయార్క్ : సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఒరాకిల్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు శాతానికి పైగా కుదేలవుతున్నాయి. ఒరాకిల్ కంపెనీ మాజీ అకౌంటెంట్ పై నమోదైన విజిల్ బ్లోయర్ దావాతో ఈ షేర్లు పతనమవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటాను ఎక్కువగా చేసి చూపించడంతో మాజీ అకౌంటెంట్ స్వెత్లానా బ్లాక్బర్న్ పై ఈ దావా కేసు నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికా జిల్లా కోర్టులో బుధవారం ఈ కేసు నమోదైంది. అమ్మకాల వసూళ్లను అంచనావేసిన దానికంటే మిలియన్ డాలర్లలో ఎక్కువగా రికార్డులో చూపిందనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఆమె చూపిన క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటా అంతా అశాస్త్రీయమని దావా పేర్కొంటోంది.
అయితే ఈ ఆరోపణలను ఒరాకిల్ ఖండించింది. కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. తమ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా కచ్చితమైనవని, శాస్త్రీయమైనవని ఒరాకిల్ అధికార ప్రతినిధి డెబోరా హిలింగర్ తెలిపారు. ఈ మాజీ ఉద్యోగి ఒరాకిల్ లో ఏడాది కంటే తక్కువ రోజులే పనిచేసిందని, అకౌంటింగ్ గ్రూప్ లో ఆమె అసలు పనిచేయలేదని పేర్కొన్నారు. పేలవమైన ప్రదర్శనతో తనని ఒరాకిల్ నుంచి తీసివేశామని డెబోరో చెప్పారు.
క్లౌడ్ కంప్యూటింగ్ డిపార్ట్ మెంట్ కు బ్లాక్బర్న్ మాజీ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్. అయితే ఆమె పదేపదే అశాస్త్రీయమైన లెక్కలు చూపుతుందని ఈ దావా పేర్కొంది. బ్లాక్బర్న్ పై కంపెనీ పలు మార్లు సీరియస్ అయినా కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని వెల్లడించింది. ఈ అశాస్త్రీయమైన రిపోర్టులు నివేదిస్తూ... ప్రజలను, కంపెనీని తప్పుదోవ పట్టిస్తున్నందుకు బ్లాక్బర్న్ పై విజిల్ బ్లోయర్ కింద కేసు నమోదైంది. ఈ దావా కేసు బయటికి పొక్కగానే ఒరాకిల్ షేర్లు 4.6శాతం మేర పడిపోయాయి.