స్టార్టప్ కంపెనీలకు ఒరాకిల్ దన్ను
కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి చేదోడువాదోడుగా.. అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు టెక్నాలజీని అందిస్తున్న ఒరాకిల్.. దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను స్థాపించబోతోంది. దేశానికి మేలు చేసే ఏ వ్యాపార ఆలోచనైనా తాము ప్రోత్సహిస్తామని ఒరాకిల్ అధినేత థామస్ కురైన్ తెలిపారు. పెద్ద కంపెనీలకే కాకుండా ప్రతి ఒక్కరికీ తమ సేవలను అందించడమే లక్ష్యమన్నారు. ఈ ఇంక్యుబేటర్ వల్ల వెంచర్ కేపిటల్ ఫండ్స్ నుంచి కొత్తగా ప్రారంభించబోయే కంపెనీలకు సూచనలు, విజయవంతమైన స్టార్టప్‌ల మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సలహాలు అందిస్తామన్నారు.
ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలేటర్‌ను మొదట బెంగళూరులో ప్రారంభిస్తామని, ఇది అమెరికా తర్వాత రెండో అతి పెద్ద స్టార్టప్ హబ్‌గా నిలవబోతుందని చెప్పారు. ఇలా వచ్చే 12 నెలల్లో మిగతా ప్రాంతాల్లో స్టార్టప్ హబ్ లను నెలకొల్పుతామన్నారు. ముంబై, పుణే, చెన్నై, గుర్గవ్, హైదరాబాద్, తిరువనంతపురం, విజయవాడలలో ఈ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు ఒరాకిల్ తెలిపింది.