రూపాయికీ బంగారం..? | Paytm Launches Digital Gold, Makes Gold Investment Digital | Sakshi
Sakshi News home page

రూపాయికీ బంగారం..?

Published Fri, Apr 28 2017 12:28 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

రూపాయికీ బంగారం..? - Sakshi

రూపాయికీ బంగారం..?

పసిడిలో పెట్టుబడులకు ‘పేటీఎం’ కొత్త ప్రచారం
ఎంఎంటీసీతో కలిసి ’డిజిటల్‌ గోల్డ్‌’ ప్లాన్‌
ఆన్‌లైన్‌లోనే క్రయ, విక్రయాలు
కావాలనుకుంటే 1 గ్రాము నుంచి నాణేల రూపంలో డెలివరీ  


న్యూఢిల్లీ: డిజిటల్‌ వాలెట్‌ కంపెనీ పేటీఎం... ఆన్‌లైన్‌ పసిడి క్రయ, విక్రయాల్లోకి కూడా ప్రవేశించింది. పసిడి రిఫైనరీ సంస్థ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ)తో కలిసి ’డిజిటల్‌ గోల్డ్‌’ ప్లాన్‌ను ప్రారంభించింది. తమ పేటీఎం మొబైల్‌ వాలెట్‌ ద్వారా కస్టమర్లు అత్యంత తక్కువగా రూ.1 పెట్టుబడితో కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలున్న బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. 999.9 స్వచ్ఛత గల 24 క్యారట్ల బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొన్నవారు...  ఎంఎంటీసీ– పీఏఎంపీకి చెందిన సురక్షితమైన వాల్టులలో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

 నిజానికి ఎంఎంటీసీకి డిజిటల్‌ రూపంలో (సర్టిఫికెట్ల రూపంలో) బంగారాన్ని డెలివరీ చేసే సదుపాయం లేదు. అది భౌతిక బంగారాన్నే డెలివరీ చేస్తుంది. మరి రూపాయికెంత బంగారం వస్తుంది? దీనికి విజయ్‌ శేఖర్‌ శర్మ సమాధానమిస్తూ... పెట్టుబడి విలువ కనీసం 1 గ్రాము దాకా పోగుపడిన తర్వాత కావాలనుకుంటే డెలివరీ తీసుకోవచ్చని చెప్పారు. అంటే పెట్టుబడి కనీసం రూ.3వేల దాకా ఉంటేనే బంగారాన్ని డెలివరీ తీసుకోగలుగుతారు.

 కొనుగోలు చేసిన బంగారాన్ని 1, 2, 5, 10 ,20 గ్రాముల నాణేల రూపంలో ఇంటి వద్దకే డెలివరీ తీసుకోవచ్చని లేదా ఆన్‌లైన్‌లోనే ఎంఎంటీసీ–పీఏఎంపీకి విక్రయించవచ్చని శర్మ చెప్పారు. కస్టమర్లు విక్రయించదల్చుకున్న పక్షంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. డబ్బును యూజర్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు.

‘భారతీయులు పసిడిలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. వారు డిజిటల్‌ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్‌ చేసే ప్రక్రియను మేం సులభతరం చేస్తున్నాం‘ అని శర్మ చెప్పారు. ప్రస్తుతం పేటీఎం ద్వారా రూ.20,000 పైబడిన లావాదేవీలు జరిపే వారంతా కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటోంది. గోల్డ్‌ స్కీమ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. పసిడి వినియోగదారులు బంగారం స్వచ్ఛత, సురక్షితంగా నిల్వ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంఎంటీసీ–పీఏఎంపీ చైర్మన్‌ మెహ్‌దీ బర్‌ఖుర్‌దార్‌ చెప్పారు. తాజా స్కీమ్‌తో ఉత్తమ నాణ్యత గల బంగారంలో అత్యంత తక్కువ స్థాయి నుంచి ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు లభించగలదన్నారు.

అత్యధిక వినియోగం భారత్‌లోనే...
ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో పసిడి వినియోగం ఉంటోంది. దేశీయంగా ఇళ్లల్లో, బ్యాంకు లాకర్లలో సుమారు 900 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 24,000 టన్నుల పైచిలుకు బంగారం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో కాయిన్లు, ఆభరణాలు ఇతరత్రా భౌతిక రూపంలో బంగారం కొనుగోలు కన్నా డిజిటల్‌ / పేపర్‌ రూపంలో పసిడి కొనుగోళ్లు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  

బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై రూ. 10,000 కోట్లు..
బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసుల వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంపై వచ్చే మూడేళ్లలో రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లుగా రూ. 3,200 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. తమ పేమెంట్స్‌ బ్యాంక్‌కు త్వరలోనే తుది అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతేడాది దీపావళికే కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనుమతుల్లో జాప్యం కారణంగా వాయిదాపడింది. 150 కోట్ల స్థాయిలో ఉన్న పేటీఎం లావాదేవీల పరిమాణాన్ని ఈ ఏడాది 450 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు శర్మ చెప్పారు. విజయవాడ, వైజాగ్, జైపూర్, సోనేపట్‌ వంటి నగరాల్లో తమ కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement