
ఇంధన ధరలు ఇంతింతై..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ 84.09కు చేరగా, ముంబైలో అత్యధికంగా పెట్రోల్ లీటర్‌కు రూ 86.72 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌కు రూ 79.31కు చేరింది. ఇక డీజిల్ ధరలూ రికార్డు స్ధాయికి చేరాయి. దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబైలో డీజిల్ లీటర్‌కు రూ 75.74కు పెరిగింది.
అమెరికన్ డాలర్‌తో రూపాయి అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయిన క్రమంలో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి బలహీనం వంటి అంతర్జాతీయ అంశాలే కారణమని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు.
ముడిచమురు ఉత్పాదన పడిపోవడం కూడా ధరల పెంపునకు కారణమని చెప్పుకొచ్చారు. పెట్రో ధరల పెంపు తాత్కాలికమేనని త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుందని మంత్రి పేర్కొన్నారు.