భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర | Petrol at Rs 79/litre in Mumbai at highest since August 2014 | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర

Published Mon, Sep 11 2017 7:46 PM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర - Sakshi

భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి తొలిసారి పెట్రోల్‌ ధరలు అత్యధిక గరిష్ట ధరలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో సోమవారం లీటరు పెట్రోల్‌ ధర రూ.79.41గా రికార్డైంది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక స్థాయి. ఈ రోజు ఒక్కరోజే లీటరు పెట్రోల్‌ ధర 13 పైసలు, లీటరు డీజిల్‌ ధర 25 పైసల మేర పెరిగింది. పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో, పెట్రోల్‌ ధరలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉన్నాయి. ఈ విభిన్నమైన ధరలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.70.30, కోల్‌కత్తాలో రూ.73.05గా, చెన్నైలో రూ.72.87గా ఉన్నాయి.  అదేవిధంగా డీజిల్‌ ధరలు కూడా ఢిల్లీలో రూ.58.62గా, కోల్‌కత్తాలో రూ.61.27గా, ముంబైలో రూ.62.26గా, చెన్నైలో రూ.61.73గా ఉన్నాయి.
 
రోజువారీ సమీక్ష విధానం చేప్పటినప్పటి నుంచి పెట్రోల్‌ ధరలు లీటరు 7 రూపాయల మేర పెరిగినప్పటికీ, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ చెప్పారు. అంతర్జాతీయ ఆయిల్‌ ధరల్లో కొద్దీ మార్పు వచ్చినప్పటికీ ఆ ప్రయోజనం వెనువెంటనే వినియోగదారులకు చేరవేయడానికి రోజువారీ ధరల సమీక్ష ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జూన్‌ 16 నుంచి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ విధాన్ని చేపడుతున్నాయి. రోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు కనిపిస్తోంది. కాగ, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాలు(ఓపెక్‌)లో క్రూడ్‌ ధరలు బ్యారల్‌కు 50 డాలర్ల మార్కును దాటాయి. సెప్టెంబర్‌ 4న ఈ ధరలు 50.36 డాలర్లుంటే, శుక్రవారం ముగింపుకు ఓపెక్‌ బాస్కెట్‌లో బ్యారెల్‌ క్రూడ్‌ ధర 52.53 డాలర్లుగా నమోదైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement