మూడేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయని, వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి చెప్పారు. ఈ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే, వీటి ఖర్చులను అంచనావేయడానికి వీలుపడుతుందన్నారు. గత మూడు నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు 18 శాతం, డీజిల్ ధరలు 30 శాతం పెరిగినట్టు మంత్రి చెప్పారు. ఇర్మా తుఫాను ప్రభావంతో ఈ ధరలు భారీగా పెరిగినట్టు పేర్కొన్నారు.
ఇర్మా, హార్వే కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్‌పుట్ 13 శాతం పడిపోయిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అవలంభిస్తున్న రోజువారీ ధరల సమీక్ష విధానం చాలా పారదర్శకంగా ఉందని, దీర్ఘకాలికంగా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జూన్ 16 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విధానాన్ని చేపడుతున్నాయి. రోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆయిల్ ధరలతో, దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఎగుస్తున్నాయి.