పెట్రో ధరలు బాగా తగ్గే అవకాశం?
పెట్రోలు, డీజిల్ ధరలు మరో వారం రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత నెల 30వ తేదీన పెట్రోలు ధరను లీటరుకు 31 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 71 పైసలు తగ్గించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. దాంతో ఈనెల 15వ తేదీన నిర్వహించే సమీక్ష తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే తగ్గొచ్చని అంటున్నారు. మన దేశం తమ అవసరాల కోసం 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది.
అంతర్జాతీయంగా చమురు ధరలతో పాటు, రూపాయి విలువ కూడా మన పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్రీసు సంక్షోభం, ఇరాన్ చర్చల్లో పురోగతి, డాలర్ బలోపేతం కావడం, చైనా స్టాక్ మార్కెట్లు పడిపోవడం లాంటి కారణాలతో ఈవారంలో అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా మళ్లీ బ్రెంట్ క్రూడాయిల్ ధర 60 డాలర్ల దిగువ స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు బ్రెంట్ క్రూడ్ 57 డాలర్ల వద్ద ట్రేడయింది. మరో వారం రోజుల్లో ఇది 50 డాలర్ల కంటే కూడా తగ్గొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనకు కూడా ఈ తగ్గింపు ఫలితం బాగానే కలిసి రావొచ్చన్నమాట.