పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన వినైల్ కెమికల్స్ ఇటీవల ర్యాలీ బాట పట్టింది.పరేఖ్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ ప్రధానంగా కెమికల్స్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా విదేశీ కంపెనీల నుంచి వినైల్ ఎసిటేట్ మోనోమర్(VAM) సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేస్తుంటుంది. కంపెనీలో పిడిలైట్ ఇండస్ట్రీస్‌కు 50.62 శాతం వాటా ఉంది. ఈ మార్చికల్లా వినైల్ కెమికల్స్‌లో పబ్లిక్ వాటా 40.9 శాతంగా నమోదైంది.
జోరు తీరిలా
వినైల్ కెమికల్స్ షేరు వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో అమ్మేవాళ్లు కరువై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 10 ఎగసి రూ. 109 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 1కల్లా ఈ కౌంటర్లో 1.42 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది వినైల్ కెమికల్స్ ఈక్విటీలో 7.7 శాతం వాటాకు సమానంకావడం విశేషం! ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి లక్ష షేర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి.
50 శాతం ప్లస్
గత నెల రోజుల్లో వినైల్ కెమికల్స్ షేరు ఏకంగా 111 శాతం దూసుకెళ్లింది. రూ. 52 స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 109కు ర్యాలీ చేసింది. గత వారం రోజుల్లోనే 50 శాతం పురోగమించింది. ఈ షేరు ఇంతక్రితం 2018 మే 2న రూ. 136 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. కాగా.. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నిరుత్సాహకర పనితీరు నేపథ్యంలో షేరు నీరసించినప్పటికీ ఇటీవల జోరు చూపుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే షేరు ర్యాలీ వెనుక కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment