న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అంతర్జాతీయ నిపుణులతో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేసంలో బ్రిటన్ చమురు దిగ్గజం బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈడీ ఫాతిహ్ బిరోల్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల రాకకు ఎదురవుతున్న నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాలని, సహజ వాయువు ధరలపై నియంత్రణలను ఎత్తివేయాలని నిపుణులు ఈ సందర్భంగా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా క్రూడాయిల్ బ్యారెల్ రేటు 37 డాలర్లకు పడిపోవడంతో చమురు కంపెనీలు పెట్టుబడులను, సిబ్బందిని తగ్గించుకుంటున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్‌లో వేలం వేసే క్షేత్రాల గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరను ఇచ్చే ప్రతిపాదన పరిధిలోకి ప్రస్తుత నిక్షేపాలకు కూడా వర్తింపచేసే అంశం ఇందులో చర్చకు వ చ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
చమురు, గ్యాస్ రంగంలో టెక్నాలజీలను మెరుగుపర్చుకోవడం, మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పినట్లు వివరించింది.
ఇంధన రంగంలో పెట్టుబడులపై కేంద్రం దృష్టి
Published Wed, Jan 6 2016 2:25 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement