లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడికి చాన్స్
వ్యాపార, పారిశ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరిస్తాం
- మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి
- అరబ్ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ ఆహ్వానం
మస్దర్ (యూఏఈ): భారత్‌లో దాదాపు లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.65 లక్షల కోట్లు) మేర పెట్టుబడులకు తక్షణ అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇన్‌ఫ్రా, రియల్టీ, ఇంధనం తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా అరబ్ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. వ్యాపారవర్గాల సమస్యలను పరిష్కరించేందుకు, అరబ్ దేశాలతో 34 సంవత్సరాలుగా వాణిజ్య లోటును తొలగించేందుకు తమ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని మోదీ వివరించారు.
గత ప్రభుత్వాల అనిశ్చితి, అలసత్వం కారణంగా నిల్చిపోయిన అనేక పనులను పునఃప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అబుధాబిలోని మస్దర్ నగరంలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాపార దిగ్గజాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా కొన్ని సమస్యలు కూడా మా ప్రభుత్వానికి సంక్రమించాయి. కేవలం కొన్ని మంచి అంశాలనే తీసుకుని, సమస్యలను పక్కన పెట్టలేము. అందుకే గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా నిల్చిపోయిన పనులను పునఃప్రారంభించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము’ అని మోదీ తెలిపారు.
‘ఆసియా శతాబ్ది’ని సాకారం చేద్దాం: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ సహా పలు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సైతం భారత్ వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహ అంచనాలతో ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఆసియా వైపు, అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఆసియాకు సంబంధించి అనేక ప్రధానాంశాల్లో యూఏఈ కీలకపాత్ర పోషిస్తోందని, అది లేకుండా ఆసియా పరిపూర్ణం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో 21వ శతాబ్దాన్ని ‘ఆసియా శతాబ్ది’గా మార్చేందుకు భారత్‌తో యూఏఈ చేతులు కలపాలన్నారు. భారత సామర్థ్యం, యూఏఈ శక్తి కలిస్తే ఇది సాధ్యమేనని మోదీ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఇన్వెస్టర్లతో చర్చించేందుకు వాణిజ్య మంత్రిని యూఏఈకి పంపిస్తానని మోదీ హామీ ఇచ్చారు.
మస్దర్ సిటీలో మోదీ టూర్ దాదాపు గంటపైగా సాగింది. ‘విజ్ఞానమే జీవితం’ అని టూర్ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ఆయన రాశారు. డ్రైవర్ రహిత పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ కారులో మోదీ కొద్ది సేపు ప్రయాణించారు. మైక్రో-నానో ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ, మైక్రోస్కోపీ ల్యాబ్ మొదలైనవి సందర్శించారు.
34 సంవత్సరాలు కోల్పోయాం..
యూఏఈ, భారత్ మధ్య 700 ఫ్లయిట్స్ నడుస్తున్నాయని, కానీ భారత ప్రధాని యూఏఈకి రావడానికి 34 సంవత్సరాలు పట్టేసిందని మోదీ పేర్కొన్నారు. గడిచిన 34 ఏళ్లలో భారత ప్రధానుల్లో ఏ ఒక్కరూ యూఏఈలో పర్యటించలేదని, ఫలితంగా అన్ని సంవత్సరాల మేర అవకాశాలను కోల్పోయామని చెప్పారు. ఇలాంటిది పునరావృతం కాబోదని, ఇన్ని సంవత్సరాల లోటును భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 125 కోట్ల జనాభా గల భారత్‌లో అపార అవకాశాలను ఉన్నాయన్నారు. వేగవంతంగా, నాణ్యమైన గృహాలను చౌకగా నిర్మించేందుకు ఉపయోగపడే టెక్నాలజీ భారత్‌కు అవసరమని మోదీ చెప్పారు.
వ్యవసాయ రంగంలో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు మొదలైనవి అవసరమని, వీటన్నింటిలోను యూఏఈ ఇన్వెస్టర్లు అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలు, ప్రభుత్వ అధికారులతో పాటు ఎటిసెలాట్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ తదితర దిగ్గజాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు పాటించాల్సిన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటోందని ప్రధాని దృష్టికి తెచ్చిన యూఏఈ ఇన్వెస్టర్లు.. ఏక గవాక్ష క్లియరెన్స్ విధానం మొదలైనవి అమల్లోకి తేవాలని కోరారు. తమ పెట్టుబడులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
75 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు..
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్‌లో తమ పెట్టుబడులను 75 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) పెంచడానికి యూఏఈ అంగీకరించింది. అలాగే వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 60 శాతం మేర పెంచుకోవాలని భారత్, యూఏఈ నిర్ణయించుకున్నాయి. ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి అంగీకరించినట్లు సంయుక్త ప్రకటనలో అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత యూఏఈ భారత్‌కి మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2014-15లో భారత్-యూఏఈల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్ల మేర ఉంది.