ముంబయి/న్యూఢిల్లీ: కస్టమర్లను కాపాడుకోవాలి.. కొత్త వారిని ఆకర్షించాలి.. ఆదాయం పెంచుకుకోవాలి.. ఇలా ఎన్నో టార్గెట్లతో సతమతమౌతోన్న టెలికం కంపెనీలకు ఇంకొక చిక్కొచ్చిపడింది. కొత్త కొత్త మార్గాలతో రాబడి పెంచుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న టెల్కోలకు పోస్ట్‌పెయిడ్ రూపంలో సమస్య ఎదురైంది. మొబైల్ యూజర్లు పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్‌కు మారిపోతున్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక విలువ కలిగి ఉండటం ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెలికం కంపెనీలు పోస్ట్‌పెయిడ్ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ యూజర్లు అటువైపు నుంచి ప్రీపెయిడ్ వైపునకు వస్తున్నారు. టెల్కోలకు సాధారణంగా పోస్ట్‌పెయిడ్ విభాగం నుంచి రాబడి ఎక్కువగా ఉంటుంది.
పోస్ట్‌పెయిడ్ యూజర్లు తగ్గారు..
కస్టమర్లు ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు ఆకర్షితులౌతుండటంతో పోస్ట్‌పెయిడ్ విభాగపు సబ్‌స్క్రైబర్ల సంఖ్య త్రైమాసికం పరంగా చూస్తే తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 2 శాతంమేర క్షీణించింది. సాధారణంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కన్నా ప్రీపెయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం సబ్‌స్క్రైబర్ల (4జీ ఎల్‌టీఈ యూజర్లు సహా) సంఖ్యలో ప్రీపెయిడ్ విభాగపు వాటా 95.6 శాతానికి ఎగసింది. జూన్ త్రైమాసికంలో ఇది 95.5 శాతంగా ఉంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య (ఎల్‌టీఈ యూజర్లు సహా) 5.17 కోట్లకు తగ్గింది. మెట్రోలు సహా ఏ, బీ కేటగిరి సర్కిళ్లలోనూ ప్రీపెయిడ్ యూజర్ల సంఖ్య పెరిగింది.
ఆదాయం 10 శాతం డౌన్
సెప్టెంబర్ క్వార్టర్‌లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం త్రైమాసికం పరంగా చూస్తే 10 శాతంమేర తగ్గింది. రూ.5,900 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23 శాతంమేర తగ్గింది. ‘జూన్ త్రైమాసికం నుంచి గమనిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం 10 శాతంమేర క్షీణతతో రూ.5,900 కోట్లకు తగ్గిందని కొటక్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదే సమయంలో ప్రీపెయిడ్ విభాగపు ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.24,000 కోట్లకు పెరిగింది. దీనికి జియో ప్రధాన కారణమనే అభిప్రాయముంది. పరిశ్రమ ఆదాయంలో పోస్ట్‌పెయిడ్ విభాగపు వాటా 20 శాతానికి పడిపోయింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా దాదాపు 30–40 శాతం గా ఉండేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
టెల్కోలపై ఒత్తిడి ఇంకా పెరగనుందా?
టెల్కోలు ఆదాయం పెంచుకునేందుకు ఎక్కువ మందిని పోస్ట్‌పెయిడ్ విభాగంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అయితే ప్రీపెయిడ్‌లో మంచి డీల్స్ లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ప్రీపెయిడ్ వైపు ఆకర్షితులౌతున్నారు. ఈ ట్రెండ్ నేపథ్యంలో వచ్చే త్రైమాసికాల్లో టెల్కోలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువ కావొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రానున్న నెలల్లో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దక్కించుకోవడం టెల్కోలకు కష్టతరం కావొచ్చు. ప్రీపెయిడ్ విభాగంలో మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలో ధరల పోటీ నడుస్తోంది’ అని ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోని తెలిపారు. ప్రీపెయిడ్ విభాగంలోని ధరల తగ్గింపు అనేది పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సేవల మధ్య ధరల విలువలో వ్యత్యాసానికి దారితీసిందని, దీంతో యూజర్లు ప్రీపెయిడ్‌కు వెళ్తున్నారని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. పోస్ట్‌పెయిడ్ ఆదాయంపై నెలకొని ఉన్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ విభాగంలోని ప్లాన్స్ ధరలు సవరించడం సహా డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 2017 తొలినాళ్లలో టారిఫ్‌లలో మార్పులు చేయడం పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈవైకు చెందిన ప్రశాంత్ సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment