ఈ గృహాలు కొందరికే! | project visit only with invitation | Sakshi
Sakshi News home page

ఈ గృహాలు కొందరికే!

Published Sat, Aug 18 2018 2:36 AM | Last Updated on Sat, Aug 18 2018 2:36 AM

 project visit only with invitation - Sakshi

ఇల్లు కొనేముందు! ప్రాజెక్ట్‌ ఎక్కడుందో వెళ్లి కళ్లారా చూస్తాం. స్కూల్, ఆసుపత్రి, నిత్యావసరాలకు దగ్గరగా ఉంటే ఓకే అనుకొని ధర విషయంలో బేరమాడతాం. అదీ పూర్తయ్యాక.. నిర్మాణంలో నాణ్యత, గృహ ప్రవేశం గురించి ఆరా తీస్తాం! కానీ, బై ఇన్విటేషన్‌ ఓన్లీ (బీఐఓ)– అల్ట్రా లగ్జరీ గృహాల విషయంలో ఇవేవీ ఉండవు. ఈ గృహాలను కొనడం సంగతి తర్వాత కనీసం ప్రాజెక్ట్‌ చూడాలంటేనే ఆహ్వాన పత్రం ఉండాల్సిందే!

సాక్షి, హైదరాబాద్‌: బీఐఓ ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత కేవలం అంతర్జాతీయ వసతులే కాదండోయ్‌.. కస్టమైజేషన్‌! అంటే కొనుగోలుదారులకు అభిరుచికి తగ్గట్టుగా గృహ నిర్మాణం ఉండటమే. ఫ్లోర్‌ లే అవుట్, ఇంటీరియర్‌ డిజైన్స్, ఫ్లోరింగ్, సీలింగ్‌ ఇంట్లో వాడే ప్రతి వస్తువూ మనకు నచ్చినట్టుగా.. బ్రాండెడ్‌గా ఉం టుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేదు. మన దేశంలో ముంబై, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్‌లున్నాయి.

వాస్తవానికి, దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ లగ్జరీ ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేకంగా ఏరియాలున్నాయి. ప్రధాన నగరంలో స్థలం కొరత ఉంటుంది. అందుకే డెవలపర్లు కొద్దిపాటి స్థలంలో లేదా రీ–డెవలప్‌మెంట్‌ సైట్‌లలో బీఐఓ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంటారు. అందుకే కొన్ని బీఐఓ ప్రాజెక్ట్‌ల్లో స్థల పరిమితులు కారణంగా బొటిక్‌ స్టయిల్‌లో యూనిట్లుంటాయి. ఇందులో ఆశించిన స్థాయిలో వసతులు కల్పించకపోవచ్చు కూడా.

కొనుగోలు శక్తి బట్టి గృహాలు..
ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ నిర్మాణాలను చేపట్టాలి. ప్రత్యేకమైన మతాలు, ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్‌లను నిర్మించే డెవలపర్లకు మార్కెట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. కస్టమర్ల సామాజిక సంబంధాల మీద కాకుండా కొనుగోలు శక్తి ఆధారపడి బీఐఓ ప్రాజెక్ట్‌లను చేపట్టాలి. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, బిజినెస్‌ టైకూన్స్, సెలబ్రిటీలు బీఐఓ కస్టమర్లుగా ఉంటారు.

ఆయా కస్టమర్ల వివరాలు, ఫైనాన్షియల్స్‌ను డెవలపర్లు గోప్యంగా ఉంచుతారని.. అందుకే వీటిని ట్రాక్‌ చేయడం కష్టమని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పురి తెలిపారు. బీఐఓ ప్రాజెక్ట్‌ చేసే నిర్మాణ సంస్థలకు అంతర్గతంగా ఎంపిక చేసిన కస్టమర్లు, బ్రోకర్లు ఉంటారు. ఆయా కస్టమర్ల ఆర్థిక స్థితిగతులు, జీవన శైలి, ఇతరత్రా ఆసక్తులను అంచనా వేస్తారు. అప్పటికే ఆయా డెవలపర్లకు ఉన్న కస్టమర్లలో లగ్జరీ అవసరాలను కోరుకునే వారికి ప్రాజెక్ట్‌కు సంబం ధించిన సమాచారాన్ని ఫోన్, ఈ–మెయిల్, ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పంపిస్తారు.

అంతర్జాతీయ వసతులు..
బీఐఓ ప్రాజెక్ట్‌ల వసతులన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. హెలిప్యాడ్, ఇన్‌–సూట్‌ లేదా రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్‌ పూల్, ప్రైవేట్‌ ఎలివేటర్స్, ఇంట్లోనే రెస్టారెంట్, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా మల్టిపుల్‌ పార్కింగ్‌ సదుపాయం, బారిక్యూ పిట్స్, సన్‌ డెక్స్, అల్ట్రా హైటెక్‌ సెక్యూరిటీ సేవలు వంటివి ఉంటాయి. నిర్మాణంలో వాడే ప్రతి ముడి సరుకూ బ్రాండెడ్‌ ఉంటుంది. ఇంధన సామర్థ్యం ఎల్‌ఈడీ లైట్లు, వర్టికల్, రూఫ్‌ గార్డెన్స్, సెంట్రలైజ్‌ వాక్యూమ్‌ సిస్టమ్, హై ఎండ్‌ మాడ్యులర్‌ కిచెన్, ఇటాలియన్‌ మార్బుల్, సెంట్రలైజ్‌ ఏసీ సిస్టమ్, డిజిటల్‌ లాక్స్‌ అండ్‌ డోర్స్, ఆటోమేటిక్‌ కర్టెన్స్‌ అండ్‌ డెకరేటివ్స్‌ వంటి ఏర్పాట్లుంటాయి.


ఏటా 10–15 ఫ్లాట్ల విక్రయం
దేశ జనాభాలో మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజీ), ఆపైన తరగతి కేవలం 4 శాతం వరకుంటుంది. ఇందులో అల్ట్రా లగ్జరీ విభాగం 1 శాతం ఉంటుంది. దేశంలోని మొత్తం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో బీఐఓ మార్కెట్‌ వాటా 5–6 శాతం ఉంటుంది. ఏటా దేశంలో 10–15 బీఐఓ గృహాలు మాత్రమే అమ్ముడవుతాయి. ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంటారు. అందుకే నగరాలను బట్టి వీటి ధరలు మారుతుంటాయి. బిల్డర్‌ బ్రాండింగ్, ప్రాజెక్ట్‌ ప్రాంతం, వసతులను బట్టి వీటి ప్రారంభ ధర రూ.3 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement