4 పెద్ద బ్యాంకులైనా ఉండాలి
పటిష్టమైన వాటినే విలీనం చేయాలి
గృహ రుణాలకు మరిన్ని పన్ను ప్రయోజనాలు కావాలి
ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్ జరగాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో 3, 4 పెద్ద బ్యాంకులు ఉండటం చాలా ముఖ్యమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. పటిష్టమైన బ్యాంకులతో పటిష్టమైన వాటినే విలీనం చేయడం మంచిదని గురువారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. ‘భారత్‌లో 3-4 పెద్ద బ్యాంకులు ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం బ్యాంకులు పరస్పరం చర్చించుకోవాలి. సరైన భాగస్వాములుగా ఎవర్ని ఎంచుకోవాలో అవే నిర్ణయించుకోవడం ముఖ్యం. గతంలో ప్రభుత్వ ఒత్తిడితో కొన్ని బ్యాం కులు విలీనమయ్యాయి’ అని అరుంధతి పేర్కొన్నారు. విలీనాలనేవి బలహీన బ్యాంకును కాపాడేట్లు గాకుండా పరస్పరం బలాలను ఉపయోగించుకునేలా సమఉజ్జీల మధ్య ఉండటం శ్రేయస్కరం అన్నారు.
ఈక్విటీ జారీ..: బాసెల్ 3 నిబంధనల అమలు కోసం బ్యాంకులు డిఫరెన్షియల్ వోటింగ్ హక్కులతో షేర్ల జారీ బాట పట్టక తప్పదని అరుంధతి చెప్పారు. తాము కూడా ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. దశలవారీగా ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి రూ. 1.60 లక్షల కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బ్యాంకర్ల జీతాలు అంతంతమాత్రం..
మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల జీతభత్యాలు తీసికట్టుగా ఉంటున్నాయని అరుంధతి వ్యాఖ్యానించారు. సమర్ధులు, నిపుణులను ఆకర్షించాలంటే అందుకు తగ్గ పారితోషికమూ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరోవైపు ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా గృహ, విద్యా రుణాలు తీసుకునేవారికి పన్నుపరంగా మరిన్ని ప్రయోజనాలను రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని అరుంధతి చెప్పారు. ప్రస్తుతం రూ. 15 లక్షల దాకా గృహ రుణాలపైనే వడ్డీ రాయితీ ప్రయోజనం వస్తోందని, ఈ పరిమితిని రూ. 25 లక్షలు పెంచాలని.. గృహ విలువను రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షలకు పెంచాలని ఆమె చెప్పారు.