క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే కీలకం... | Q3 Results Are Key To Economies Of Scale | Sakshi
Sakshi News home page

క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే కీలకం...

Published Mon, Jan 13 2020 3:56 AM | Last Updated on Mon, Jan 13 2020 3:56 AM

Q3 Results Are Key To Economies Of Scale - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటనలు, ద్రవ్యోల్బణ గణాంకాల వంటి స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ ఏకంగా 24 శాతం వృద్ధితో అంచనాలకు మించి నికర లాభాన్ని శుక్రవారం ప్రకటించి, బంపర్‌ ఫలితాలతో క్యూ3 బోణీ కొట్టింది. దీంతో ఈ వారంలో వెల్లడికానున్న మిగిలిన దిగ్గజ ఐటీ కంపెనీల ఫలితాలపై అంచనాలు పెరిగాయి.

ఇదే రంగానికి చెందిన విప్రో సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (అక్టోబర్‌ – డిసెంబర్‌) ఫలితాలను ప్రకటించనుండగా.. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్‌ (టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్‌ ఈ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఇన్ఫీ ఫలితాలకు మార్కెట్‌ స్పందించనుందని, ఆ తరువాత వెల్లడికానున్న ఫలితాల ఆధారంగా ఈ వారం ట్రేడింగ్‌ కొనసాగనుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. స్టాక్‌ స్పెసిఫిక్‌గా భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  

ఫలితాలు నడిపిస్తాయ్‌...
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అతిపెద్ద కంపెనీ, ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) క్యూ3 ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో.. మైండ్‌ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్,  బంధన్‌ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టి ఇన్ఫోటెక్, ఎల్‌ అండ్‌ టి ఫైనాన్స్, ఎల్‌ అండ్‌ టి టెక్నాలజీ వంటి 75 దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్‌ కదలికలపై ప్రభావం చూపనున్నాయని ట్రేడింగ్‌బెల్స్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ సంతోష్‌ మీనా అన్నారు. ఫలితాలతో పాటు.. వచ్చే నెల తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020–21 బడ్జెట్, ఆర్‌బీఐ పాలసీ ప్రభావం కూడా ఈ వారం ట్రేడింగ్‌పై ఉండనుందని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ షిబాని కురియన్‌ విశ్లేíÙంచారు. బడ్జెట్‌ సమీపిస్తున్నందున ఒడిదుడుకులు పెరగనున్నాయని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

స్థూల ఆర్థికాంశాలు...
గతేడాది డిసెంబర్‌ సీపీఐ ద్రవ్యోల్బణం ఈ నెల 13న (సోమవారం) వెల్లడికానుండగా.. ఆ తరువాత రోజున డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌(ఎగుమతులు–దిగుమతులు) డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత శుక్రవారం పారిశ్రామికోత్పత్తి వెల్లడికాగా, నవంబర్‌లో ఈ సూచీ 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. మూడు నెలల తర్వాత క్షీణత నుంచి బయట పడింది. ఈ సానుకూల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌ తొలి సెషన్లో కనిపించవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు నెమ్మదిగా కరిగిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి అమెరికా–చైనా వాణిజ్య చర్చల వైపునకు మళ్లనుందని వినోద్‌ నాయర్‌ అన్నారు. చైనా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఈ నెల 13 నుంచి 15 వరకు అమెరికా ప్రభుత్వ పరిపాలన అధికారులతో సమావేశం కానుంది. తాజాగా కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల సభ్యులు సంతకం చేయనున్నారని అంచనా. ఇదే జరిగితే మార్కెట్‌ నూతన శిఖరాలను దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ఇక చైనా దేశ జీడీపీ డేటా, పారిశ్రామికోత్పత్తి శుక్రవారం వెల్లడి కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement