ప్రైవేట్ బీమా సంస్థలు క్లెయిమ్‌లు సెటిల్ చేయవా?
ప్రస్తుతం నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ డెరైక్ట్ ప్లాన్‌లు. అన్నీ ఆన్‌లైన్ మోడ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడు మ్యూచువల్ ఫండ్స్‌కు రిజిస్ట్రార్‌గా క్యామ్స్, మిగిలిన రెండు మ్యూచువల్ ఫండ్స్‌కు కార్వీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. అన్ని ఫండ్స్‌లో ఒకే సేవింగ్స్ ఖాతా ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతాను మారుద్దామనుకుంటున్నాను. ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకు ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతా మార్పు గురించి వెల్లడించాలా?లేక మరే విధమైన ఇతర పద్ధతి ఉందా? - సాగరిక, హైదరాబాద్
మీరు ఇన్వెస్ట్ చేసే సేవింగ్స్ ఖాతాను మార్చినట్లయితే సదరు మార్పు, చేర్పుల వివరాలను ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెల్లడించాల్సి ఉంటుంది. మరొక రకమైన పద్ధతి ఏమిటంటే, ఎంఎఫ్ యుటిలిటిస్ ఇండియా ద్వారా మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిని ఒకే గొడుగు కిందకు తేవచ్చు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(యాంఫి) ప్రారంభించిన కామన్ ప్లాట్‌ఫామ్ ఇది. ప్రస్తుతమున్న 25 మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్స్, లావాదేవీల కోసం యాంఫి ఈ కామన్ ప్లాట్‌ఫామ్‌ను(ఎంఎఫ్ యుటిలిటిస్ ఇండియా) అందుబాటులోకి తెచ్చింది.
కామన్ అకౌంట్ నంబర్(క్యాన్) ద్వారా ఎంఎఫ్ యుటిలిటీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిని యాక్టివేట్ చేయాలంటే క్యాన్ దరఖాస్తును పూర్తి చేసి, మీకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్(క్యామ్స్, కార్వీ వంటి సంస్థలు) లేదా ఫండ్ హౌస్‌కు సమర్పించాలి. క్యాన్ దరఖాస్తుతో పాటు క్యాన్సిల్ చేసిన చెక్కును, సంతకం చేసిన పాన్/ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కూడా అందజేయాలి. ఇది పూర్తయిన తర్వాత మీ ఖాతా వివరాలను/కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
నేను ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్, జీవన్ సరళ్ పాలసీలు తీసుకున్నాను. ఈ రెండు పాలసీల్లో 2012 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. మొదటి దాని కాలపరిమితి 35 ఏళ్లు. కాగా రెండో దాని కాలపరిమితి 15 ఏళ్లు. ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్‌కు ప్రీమియమ్ రూ.30,360 కాగా, రెండో దానికి ప్రీమియమ్ రూ.16,376గా చెల్లిస్తున్నాను. ఈ పాలసీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా లేక ఈ పాలసీల నుంచి వైదొలగమంటారా? - రఘు, విశాఖపట్టణం
ఈ పాలసీలను సరెండర్ చేయడమే సరైన నిర్ణయమని మేము సూచిస్తాము. ఎల్‌ఐసీ జీవన్ సరళ్, న్యూ ఎండోమెంట్.. ఈ రెండు పాలసీలు ఎండోమెంట్, హోల్‌లైఫ్ ప్లాన్‌లు కలగలసిన ప్లాన్‌లు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే బీమా కవర్ చేస్తాయి. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నట్లయితే పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత ఏక మొత్తం పాలసీ తీసుకున్న వ్యక్తికి లభిస్తుంది. అయితే ఈ పాలసీలు ఖరీదైనవి. పాలసీలకు సంబంధించి వ్యయాలు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి పారదర్శకత ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు.
ఈ పాలసీలతో పోల్చితే బ్యాంక్ డిపాజిట్లే ఒకింత మెరుగైన రాబడులనిస్తాయని చెప్పవచ్చు. మీకు నష్టాలు వచ్చినా సరే ఈ పాలసీలను సరెండర్ చేయండి. మొదటి పాలసీలో మీరు ఏడాదికి చెల్లించే ప్రీమియమ్ రూ.30,360ను ప్రతి ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటూ పోతే 8 శాతం రాబడులను పరిగణనలోకి తీసుకుంటే మీకు రూ.59.78 లక్షలు వస్తాయి. ఇలాగే రెండో పాలసీకి చెల్లించే ప్రీమియమ్‌ను రూ.16,376ను ప్రతి ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటూ పోతే, 8 శాతం వార్షిక రాబడులను పరిగణనలోకి తీసుకుంటే, మీకు రూ.4.9 లక్షలు వస్తాయి.
ఈ రాబడులు ఈ పాలసీల సమ్ అష్యూర్డ్ కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో ఈ రెండు పాలసీలు 5-6 శాతానికి మించి రాబడులు ఇచ్చిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా ఇంతకు మించి రాబడులు వచ్చే అవకాశాలూ లేవు. అందుకని బీమా అవసరాలకు టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
ఒకే ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)లో రూ. లక్షన్నర, ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చా? - సృజన్ సేన్, ఏలూరు
ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో, పీపీఎఫ్‌లో చెరో లక్షన్నర చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం, మీకు రూ. లక్షన్నర వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్‌లతో పాటు జీవిత బీమా ప్రీమియమ్‌లు, ఈఎల్‌ఎస్‌ఎస్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఎన్‌ఎస్‌సీ, గృహరుణంపై అసలు చెల్లింపు, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. వీటిల్లో ఏమేరకు ఇన్వెస్ట్ చేసినా, మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ.లక్షన్నర వరకే పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇంతకు మించి ఇన్వెస్ట్ చేస్తే మీకు మినహాయింపులు రావు. ఇక ఈపీఎఫ్ విషయంలో మీ కోసం మీ కంపెనీ చెల్లించే మొత్తం పన్ను నుంచి మినహాయిస్తారు. మీ జీతం నుంచి చెల్లించే మొత్తానికి సెక్షన్ 80 సీ కింద మినహాయింపు లభిస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యాక్స్ లైఫ్ నుంచి రూ.50 లక్షలకు టర్మ్ బీమా పాలసీ తీసుకున్నాను. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే ప్రైవేట్ బీమా కంపెనీలు నామినీలకు డబ్బులు చెల్లించవని, డబ్బు సంపాదన కోసమే పాలసీలు విక్రయిస్తాయని కొందరు మిత్రులు భయపెడుతున్నారు. ఇది నిజమేనా? తగిన సలహా ఇవ్వండి. - శేఖర్‌రావు, కరీంనగర్
మీ మిత్రులు కొందరు చెప్పింది సరైనది కాదు. ప్రైవేట్ బీమా కంపెనీలు క్లయిమ్‌లు చెల్లించవనడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే పలు ప్రైవేట్ కంపెనీలకు మంచి క్లయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉంది. ప్రైవేట్, ప్రభుత్వ బీమా సంస్థలను నియంత్రించేందుకు ఐఆర్‌డీఏ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ)ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీమా కంపెనీల ఏర్పాటు చేయటానికి పలు కఠినమైన నిబంధనలను ఐఆర్‌డీఏ రూపొందించింది.
భారత్‌లో బీమా కంపెనీలు 150 శాతం సాల్వెన్సీ మార్జిన్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మీరు తీసుకున్న మ్యాక్స్ లైఫ్ విషయానికొస్తే, మీరు మంచి టర్మ్ ప్లాన్‌ను తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రైవేట్ కంపెనీల టర్మ్ పాలసీలతో పోల్చితే ఎల్‌ఐసీ టర్మ్ పాలసీలు కొంచెం ఖరీదైనవి. మ్యాక్స్ లైఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63 శాతంగా, గ్రీవెన్స్ రిజల్యూషన్ రేషియో 99.98 శాతంగా ఉన్నాయి. ఈ టర్మ్ ప్లాన్ విషయమై మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.