న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏర్పాటు నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి నివాసంలో జైట్లీ ని కలిసిన రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
వడ్డీ రేట్ల విధానంలో కొత్త విధానాన్నిత్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్చిస్తున్నాయన్నారు. ఆగస్టు 9 న నిర్వహించే వడ్డీ రేట్ల సమీక్షలో ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటి (మానిటరీ పాలసీ కమిటీ) మెకానిజం అమలుపై ఈ భేటీ జరిగిందని తెలిపారు. అయితే ఆగస్టు 9న సమీక్ష నుంచే కమిటీ పని మొదలు కానుందా అని ప్రశ్నించినపుడు దానికోసమే ప్రయత్నిస్తున్నామని.. ఎంత తొందరగా ఇది సాధ్యమవుతుందో చూడాలని చెప్పారు.
ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసిన కేంద్రం,మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. ప్రస్తుత విధానం ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్‌బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనుంది అయితే, ఈ కమిటీ నిర్ణయాన్ని ఆమోదించడం లేదా తోసిపుచ్చే (వీటో) అధికారం మాత్రం ఆర్‌బీఐ గవర్నర్‌కే ఉంటుంది. అంటే తుది నిర్ణయం ఆర్‌బీఐ గవర్నర్‌కే ఉన్నట్లు లెక్క. ఎంపీసీ ఏర్పాటుతో గవర్నర్‌కు ఉన్న ఈ అధికారానికి బ్రేక్ పడుతుంది. అయితే, ఆరుగురు సభ్యుల నిర్ణయం టై (రెండు వాదనలవైపు చెరో ముగ్గురు ఉంటే ) అయితే, ఆర్‌బీఐ గవర్నర్ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తోంది.
కాగా దేశంలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలన్నది ఇకపై రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండదు. ఇప్పటిదాకా ఆర్‌బీఐ గవర్నరు తీసుకుంటున్న ఈ నిర్ణయా న్ని ఇక ప్రభుత్వమే తీసుకోనుంది. కీలకమైన పాలసీ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆర్‌బీఐ గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలకు కేంద్రం ముగింపు పలికిన సంగతి తెలిసిందే.