
రామదురైకి టాటా పగ్గాలు?
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ పదవులకు దురై రాజీనామా...
♦ ఆమోదించిన ప్రధాని మోదీ; టాటాల అభ్యర్థనతోనేనా?
♦ మిస్త్రీ తొలగింపు నేపథ్యంలో సారథ్యం ఇవ్వొచ్చని ఊహాగానాలు
♦ టీసీఎస్ మాజీ చీఫ్‌గా, పలు సంస్థల చైర్మన్‌గా అపార అనుభవం...
న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీపై వేటు... తదనంతర పరిణామాలతో తీవ్ర అలజడిలో ఉన్న టాటా గ్రూప్‌ను చక్కదిద్దే బాధ్యతను బయటి వ్యక్తులకు కాకుండా... సంస్థతో బాగా అనుబంధం ఉన్నవారికే అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా సంస్థలోని కొందరితో పాటు బయటి వ్యక్తుల పేర్లను కూడా పరిశీలించిన టాటా గ్రూప్... చివరికి తమ గ్రూప్‌తో విడదీయరాని అనుబంధంతో పాటు అపారమైన అనుబంధం ఉన్న సుబ్రమణియన్ రామదురై విషయంలో సానుకూలత కనబరుస్తున్నట్లు తెలియవస్తోంది. ఎందుకంటే రామదురై ప్రస్తుతం నరేంద్ర మోదీ సర్కారులో కేబినెట్ హోదాతో కీలకమైన నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌ఎస్‌డీసీ)లకు చైర్మన్‌గా ఉన్నారు.
సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్కిల్ ఇండియాకు ఈ రెండూ ఊతమిస్తున్నాయి. అలాంటి కీలకమైన పదవికి రామదురై రాజీనామా చేయటం... దాన్ని సర్కారు ఆమోదించటం కూడా వెనువెంటనే జరిగిపోయినట్లు సమాచారం. ఇదంతా టాటా గ్రూప్ అభ్యర్థనతోనే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త చైర్మన్‌ను నియమించేవరకూ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ఈ ఎజెన్సీలకు వైస్ చైర్మన్‌గా ఉన్న రోహిత్ నందన్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
టీసీఎస్‌తో ఎడతెగని అనుబంధం...
టాటా గ్రూప్‌లో కీలకమైన పదవులను సమర్థంగా నిర్వర్తించిన అపారమైన అనుభవం 71 ఏళ్ల రామదురై సొంతం. దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్‌ను గ్లోబల్ ఐటీ దిగ్గజంగా, మల్టీ బిలియన్ డాలర్లు ఆర్జించే దిగ్గజంగా తీర్చిదిద్దింది ఆయనే. 1996లో ఆయన టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిప్పుడు కంపెనీ ఆదాయం 155 మిలియన్ డాలర్లు మాత్రమే. 2004లో ఆయన హయాంలోనే టీసీఎస్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయింది. 2009లో ఆయన టీసీఎస్ సారథ్య బాధ్యతల నుంచి విరమించే నాటికి కంపెనీ వార్షికాదాయం ఏకంగా 6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. 2013-14లో ఈ ఆదాయం రెట్టింపై 13.4 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం.
మొత్తంమీద టీసీఎస్‌తో 42 ఏళ్ల ఎడతెగని అనుబంధానికి తెరవేస్తూ.. ఇటీవలే కంపెనీ వైస్ చైర్మన్ పదవి నుంచి కూడా రామదురై రిటైర్ అయ్యారు. సైరస్ మిస్త్రీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఇటీవలే ఆయనను టాటా సన్స్(గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ) చైర్మన్ పదవి నుంచి డెరైక్టర్ల బోర్డు అర్ధంతరంగా తొలగించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ నియామకానికి నాలుగు నెలల గడవునిస్తూ.. ఇందుకుగాను ఐదుగురు సభ్యులతో ఒక అన్వేషణ కమిటీని కూడా బోర్డు నియమించింది. కొత్త సారథి రేసులో ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఎన్.చంద్రశేఖరన్, నోయెల్ టాటా, పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో రామదురై కీలకమైన ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయడంతో... అత్యంత అనుభవశాలి, టాటా గ్రూప్ సంస్కృతి, సాంప్రదాయాలతో మమేకమైన ఆయనకే టాటా నాయకత్వ బాధ్యతలు అప్పగించొచ్చని ఊహాగానాలు గుప్పుమన్నాయి.
యూపీఏ హయాంలో నియామకం..
గత యూపీఏ ప్రభుత్వం రామదురైను 2011లో ప్రధాని నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆన్ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సలహాదారుగా కేబినెట్ మంత్రి ర్యాంకులో నియమించింది. ఆ తర్వాత 2013లో ఈ కౌన్సిల్‌ను ఎన్‌ఎస్‌డీఏలో విలీనం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో ఇదివరకే రాజీనామా పత్రాలను సమర్పించారని.. దీన్ని ఇప్పుడు ప్రధాని ఆమోదించారని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా యూపీఏ సర్కారు నియమించిన ఎన్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈఓ దిలీప్ షెనాయ్; సీఓఓ అతుల్ భట్నాగర్‌లు కూడా గతేడాది తమ పదవుల నుంచి వైదొలిగారు.
పరిశ్రమకు అవసరమైన రీతిలో నిపుణులను తయారు చేయడంలో ఎన్‌ఎస్‌డీసీ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. 2022 కల్లా దేశంలో 20 కోట్ల మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను ఇవ్వాలన్న లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాత వాళ్లందరూ ఈ సంస్థల నుంచి వెళ్లిపోవడంతో ప్రభుత్వం వీటిలో సమూల మార్పులను తీసుకురానుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పలు సంస్థలకు చైర్మన్‌గా...
టాటా గ్రూప్‌లోని పలు సంస్థలతో పాటు ఇతర కంపెనీల్లోనూ రామదురై స్వతంత్ర డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టాటాల జాయింట్ వెంచర్ ఎయిర్ ఏషియా(ఇండియా), టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలకు చైర్మన్‌గా ఉన్నారు. హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ డెరైక్టర్ల బోర్డుల్లోనూ కొనసాగుతున్నారు. రామదురైను పద్మ భూషణ్, కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్(సీబీఈ) పురస్కారాలు కూడా వరించాయి.