ఉద్యోగుల వలసల జోరు
ముంబై: సమాజంలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తాము చేస్తున్న పనిని వదిలేసి మంచి అవకాశాలు ఉన్న ఇతర ఉద్యోగాల వైపు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు. వచ్చే ఏడాది కాలంలో ఇలా ఉద్యోగాలు మారే వారి సంఖ్య ఎక్కువగా ఉండనుందని మైకెల్ పేజ్ ఇండియా సర్వేలో వెల్లడైంది.
కెరీర్ కోసమే...
వలసల జోరుకు కెరీర్ వృద్ధి బాగా ఊతమిస్తోంది. కెరీర్ బాగుంటుందనే ప్రాథమిక కారణంతోనే ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థను వదిలేసి ఇతర వాటిల్లోకి వెళ్తున్నామని 65 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న దాదాపు 82 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో తాము ఉద్యోగాలు మారుతున్నట్లు తెలిపారు. అలాగే దాదాపు 73 శాతం మంది గత ఏడాది కాలంలో చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యామని పేర్కొన్నారు. వారంలో 51 గంటలకు పైగానే పనిచేస్తున్నామని 34 శాతం మంది తెలిపారు. వారు పనిచేస్తున్న కంపెనీల డైవర్సిఫైడ్ పాలసీలపై వారికే అవగాహ న లేదని 42 శాతం మంది పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు వేతనంతో పోలిస్తే కంపెనీ పేరుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 45 శాతం మంది ఈ అంశానికి ఓటు వేశారు.
ఉద్యోగుల గమ్య స్థానం సింగపూర్
విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆసియా ప్రాంత ప్రజల ఉద్యోగ గమ్య స్థానంగా సింగపూర్ ఉంది. ఏడాది కాలంలోనే ప్రమోషన్ కోరుకునే వారు దాదాపు 70 శాతం మంది ఉన్నారు.