వృద్ధికి ఆర్‌బీఐ రెండో డోసు! | RBI Governor Shaktikanta Das announces relief measures for liquidity in system | Sakshi
Sakshi News home page

వృద్ధికి ఆర్‌బీఐ రెండో డోసు!

Published Sat, Apr 18 2020 3:53 AM | Last Updated on Sat, Apr 18 2020 7:39 AM

RBI Governor Shaktikanta Das announces relief measures for liquidity in system - Sakshi

ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్‌బీఐ మరో సారి  రంగంలోకి దిగింది. కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు  తీసుకొన్న నెలరోజుల్లోపే శుక్రవారం మరో ప్యాకేజీని అందించింది. ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్‌ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. మొండి బకాయిల విషయంలో బ్యాంకులకు, రుణ గ్రహీతలకు మరింత వెసులుబాటు కల్పించింది. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు వాటాదారులకు డివిడెండ్‌ చెల్లించకుండా నిలిపేసింది. శుక్రవారం ఉదయం వీడియో సందేశం ద్వారా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు.  

ఎన్‌పీఏల వర్గీకరణకు 180 రోజులు 
రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్‌పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణ గ్రహీతలకు ఇది ఎంతో వెసులుబాటునిస్తుంది. కాకపోతే, ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మిగిలిన వాటికి మూడు నెలల ఎన్‌పీఏ వర్గీకరణ నిబంధనే అమలవుతుంది. మారటోరియం వెసులుబాటు ఎన్‌పీఏలకు దారితీయకూడదని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాకపోతే మారటోరియం పరిధిలో ఉన్న రుణాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అదనంగా 10% నిధుల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఒక శాతంలోపు కేటాయింపులు చాలు. అదే విధంగా ఐబీసీ కింద ఎన్‌పీఏల పరిష్కారానికి 210 రోజుల గడువును మరో 90 రోజులు పెంచింది.  

రివర్స్‌ రెపో కట్‌
రివర్స్‌ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్‌ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్‌మార్క్‌ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.  

ఎల్‌సీఆర్‌ కోత
లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్‌సీఆర్‌) 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. ఎల్‌సీఆర్‌ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. వచ్చే 30 రోజుల్లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ క్యాష్‌ ఫ్లో ఎంత ఉంటుందని అంచనా వేస్తే... అంతకు సమానంగా (100 శాతం) ఈ ఎల్‌సీఆర్‌ను కూడా ఉంచుకోవాలి. దీన్నిపుడు ఆర్‌బీఐ తగ్గించింది. ఆ రకంగా మిగిలిన నిధుల్ని బ్యాంకులు ఇతరత్రా మదుపు చేయొచ్చు. లేదా రుణాలివ్వవచ్చు. అక్టోబర్‌ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1కి 100 శాతానికి తీసుకొస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు.

ద్రవ్యోల్బణం అదుపులోనే
వ్యవస్థలో లిక్విడిటీ పెంపు దిశగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ... ద్రవ్యోల్బణం తమ లకి‡్ష్యత స్థాయి 4 శాతం లోపునకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగంలో చేరుతుందని అర్‌బీఐ ప్రకటించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 5.91 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి.

రాష్ట్రాలకు మరిన్ని నిధులు..
వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్‌బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌.

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊరట
వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఇప్పటికే చాలా రుణాలిచ్చాయి. వాటిని తిరిగి చెల్లించే నిమిత్తం ఆయా డెవలపర్లు ఇప్పటికే తమ వాణిజ్య కార్యకలాపాలను ఆరంభించే తేదీలను (డీసీసీఓ) ప్రకటించారు. కాకపోతే తాజా పరిస్థితుల్లో ఆ తేదీల్లో ప్రారంభించే అవకాశాలు తక్కువ. దీంతో ఆరంభ గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ  నిర్ణయం తీసుకుంది. దీంతో సంబంధిత రుణాన్ని ఆ కాలానికి పునరుద్ధరించినట్టుగా పరిగణించరు. డెవలపర్లకు ఇది పెద్ద ఉపశమనమే.

ఆర్థిక సంస్థలకు మరో రూ.50వేల కోట్లు
జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని  ఆర్‌బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్‌బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్‌కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్‌ అందించనుంది.  

ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల అండ
ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రో ఫైనాన్స్‌ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం లకి‡్ష్యత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్‌ (టీఎల్‌టీఆర్‌వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్‌బీఐ అందించనుంది. టీఎల్‌టీఆర్‌వో 2.0 ద్వారా బ్యాంకులు ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి నిధులను తీసుకుని.. ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ కలిగిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు, ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. నిజానికిలా చేస్తే నిధులన్నీ అగ్రశ్రేణి సంస్థల చేతుల్లోకే వెళతాయి. కానీ ఈ రూ.50,000 కోట్లలో సగం మొత్తాన్ని చిన్న, మధ్య స్థాయి ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకే అందించాలని ఆర్‌బీఐ షరతు పెట్టింది.  

వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నగదు
మార్చి 1 – ఏప్రిల్‌ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్‌బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్లను విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది.

డివిడెండ్‌ పంపిణీపై నిషేధం
అన్ని వాణిజ్య, కో–ఆపరేటివ్‌ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్‌ చెల్లింపులు చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలిచేందుకు బ్యాంకులు నిధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నిషేధాన్ని 2020 సెప్టెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సమీక్షించనున్నట్టు తెలియజేశారు.

2021–22లో వృద్ధి రికవరీ వేగవంతం
2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ‘వీ’ షేప్‌లో రికవరీ అవుతుందన్న ఐఎంఎఫ్‌ అంచనాలను ఆర్‌బీఐ గవర్నర్‌ ఉదహరించారు. వృద్ధికి అడ్డుపడే సమస్యల పరిష్కారానికి పాలసీ పరంగా ఆర్‌బీఐకి మరింత వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. అవసరమైతే మరోవిడత రేట్ల కోతకు  అవకాశం ఉంటుందని సంకేతం ఇచ్చారు. వృద్ధి 2021–22లో చాలా వేగంగా పుంజుకుని 7.4 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సాధారణ వర్షపాత అంచనాలు గ్రామీణ డిమాండ్‌కు సానుకూలమన్నారు.

రూపాయి 48  పైసలు బలోపేతం
 76.39 వద్ద క్లోజింగ్‌
ముంబై:  కరోనా వైరస్‌ బారిన పడిన ఎకానమీకి ఊతమిచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన చర్యలతో రూపాయి కోలుకుంది. గురువారం నాటి ఆల్‌టైం కనిష్ట స్థాయి నుంచి రికవర్‌ అయ్యింది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం 48 పైసలు పెరిగి 76.39 వద్ద క్లోజయ్యింది. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం కూడా ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌కు ఊతమిచ్చినట్లు ట్రేడర్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచేందుకు రివర్స్‌ రెపో రేటును తగ్గించడం, నాబార్డ్, సిడ్బి వంటి సంస్థలకు రీఫైనాన్సింగ్‌ సదుపాయం కల్పించడం మొదలైన ఆర్‌బీఐ నిర్ణయాలతో రూపాయికి గట్టి మద్దతు లభించిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.

 అత్యుత్తమ ప్యాకేజీ ..
 ఇటు ప్రభుత్వం, అటు నియంత్రణ సంస్థ సత్వరం స్పందించి .. ప్రకటించిన రెండో ప్యాకేజీ అత్యుత్తమంగా ఉంది. దీనితో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకు కూడా తోడ్పాటు లభిస్తుంది

– రజనీష్‌ కుమార్, చైర్మన్, ఎస్‌బీఐ

వ్యవస్థలోకి తగినంత లిక్విడిటీ..
కరోనా వైరస్‌పరమైన సమస్యలను అధిగమించే దిశగా వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చూసేందుకు, బ్యాంకులు రుణాలిచ్చేలా ప్రోత్సహించేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు, మార్కెట్లు మళ్లీ సాధారణంగా పనిచేసేందుకు ఆర్‌బీఐ తగు చర్యలు తీసుకుంది

– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement