ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే! | RBI may keep interest rate unchanged on Tuesday | Sakshi
Sakshi News home page

ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే!

Published Mon, Feb 1 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే!

ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే!

బడ్జెట్ తర్వాతే ఏదైనా నిర్ణయం ఉండొచ్చు..
* విశ్లేషకుల అభిప్రాయం...
* రేపే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం పెరుగుదల ధోరణి నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని అధిక శాతం మంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. ద్రవ్యలోటు ఇతరత్రా స్థూల ఆర్థిక అంశాలపై కేంద్ర బడ్జెట్ తర్వాత తగిన స్పష్టత వస్తుందని, దీంతో ఆ తర్వాతే ఆర్‌బీఐ వడ్డీరేట్లపై ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చనేది వారి అభిప్రాయం. ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ రేపు(మంగళవారం) చేపట్టనుంది.

2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 29న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే, ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చేందుకు వీలుగా వడ్డీ రేట్ల తగ్గింపు అవసరమని మరికొంత మంది నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘రేట్ల కోతపై ఆశావహం ధోరణి అవసరం. అయితే, పలు రకాల గణాంకాల ఆధారంగా దీనిపై నిర్ణయం ఉంటుంది. ద్రవ్యలోటుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుంది, గతేడాది ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సాధించిన పురోగతి వంటివి బడ్జెట్‌లో తేటతెల్లమవుతాయి. ఆతర్వాత ఆర్‌బీఐ రేట్ల కోతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ పేర్కొన్నారు.
 
గత సమీక్షలో కూడా ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయని సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు తమ స్పల్పకాలిక అవసరాల కోసం ఆర్‌బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ రేటు) 6.75 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 7.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. 2015 సంవత్సరంలో ఆర్‌బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గించింది.
 
మార్చి-ఏప్రిల్‌లో పావు శాతం కోతకు చాన్స్... సిటీ గ్రూప్

 కేంద్ర బడ్జెట్ దగ్గర్లోనే ఉండటంతో ఈసారి పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించనుందని సిటీ గ్రూప్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అయితే, మార్చి లేదా ఏప్రిల్‌లలో జరిగే పాలసీ సమీక్షలో పావు శాతం కోతకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. ‘రిటైల్ ద్రవ్యోల్బణం విషయంలో స్పల్పకాలానికి పెరుగుదల రిస్కులు ఉన్నాయి. మరోపక్క, బడ్జెట్‌లో నిర్ణయాలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది.

ఈ నేపథ్యంలో పాలసీ రేట్లలో మార్పులేవీ ఉండకపోవచ్చు’ అని నివేదిక తెలిపింది. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.61 శాతానికి చేరింది. ఇక టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మైనస్‌లోనే కొనసాగుతున్నప్పటికీ... ఈ ధోరణి కాస్త తగ్గి మైనస్ 0.73 శాతంగా నమోదైంది.
 
వివిధ ఆర్థిక సంస్థలు ఏమన్నాయంటే..
డీబీఎస్: పాలసీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించొచ్చు.
హెచ్‌ఎస్‌బీసీ: బడ్జెట్‌లో ద్రవ్యలోటు కట్టడికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ(రోడ్‌మ్యాప్)ను ప్రకటిస్తుందనేదానిపై ఆర్‌బీఐ దృష్టిపెట్టనుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లలో ఇటీవలి అనిశ్చితి, బ్యాంకులు గత రేట్ల కోతల ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదలాయించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి రేట్ల కోతకు అవకాశాల్లేవు. జనవరి చివరినాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచాలన్న ఆర్‌బీఐ లక్ష్యం దాదాపు నెరవేరినట్లే. అయితే, రానున్న రెండేళ్లలో తయారీ రంగ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలన్న లక్ష్యానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉంది.
బార్‌క్లేస్: ఏప్రిల్-జూన్ మధ్యే ఆర్‌బీఐ మరో విడత రేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉంది. రేపటి పాలసీ సమీక్షలో పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. అయితే, ప్రస్తుత సరళ ధోరణిని కొనసాగించే అవకాశం ఉంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్: ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోత ఉండొచ్చని మేం ముందు నుంచీ అంచనా వేస్తున్నాం. రేట్ల తగ్గింపు క్రమం(సైకిల్) చివరి దశకు చేరుకుంది. ఇక ఇదే ఆఖరి కోత కావచ్చు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement