కీలక రేట్లు యథాతథం? | RBI policy decision meet | Sakshi
Sakshi News home page

కీలక రేట్లు యథాతథం?

Published Wed, Dec 6 2017 12:15 AM | Last Updated on Wed, Dec 6 2017 12:15 AM

RBI policy decision meet - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం బుధవారం ముగుస్తుంది. అనంతరం రెపో, రివర్స్‌ రెపో, ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్‌ వంటి కీలక రేట్లకు సంబంధించిన ప్రకటన విడుదలవుతుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో. ప్రస్తుతం ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి 6 శాతం దగ్గరుంది. దీన్ని తగ్గించాలని, తద్వారా వృద్ధికి ఊతమివ్వాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్నే కోరుకుంటోంది. అయితే ఆర్‌బీఐ ఎంపీసీ మాత్రం ఆగస్టు తగ్గింపు నిర్ణయం తరువాత– ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకర్లకూ సూచిస్తోంది.

ఈసారీ మార్పుండదు!!
ఈ దఫా కూడా తన విధానాన్ని యథాతథంగా కొనసాగించే వీలుందని మెజారిటీ విశ్లేషణలు వస్తున్నాయి. టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59 శాతంగా నమోదయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇక ఇదే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం  ఏడు నెలల గరిష్ట స్థాయి 3.58 శాతానికి ఎగిసింది. ఇక జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతం (ఏప్రిల్‌–జూన్‌) నుంచి కొంత మెరుగుపడి 6.3 శాతానికి పెరిగింది. జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల  దిగువబాటను వీడడం పట్ల ఆర్థిక విశ్లేషకుల్లో కొంత సంతృప్తి వ్యక్తమయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement