
న్యూఢిల్లీ: మొండిబాకీల లెక్కల్లో వ్యత్యాసాల్లేవన్న (డైవర్జెన్స్) ప్రకటనపై రిజర్వ్ బ్యాంక్ అక్షింతలు వేసిన నేపథ్యంలో యస్ బ్యాంక్ వివరణనిచ్చింది. నిబంధనల ప్రకారమే ‘నిల్ డైవర్జెన్స్’ గురించి వెల్లడించామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆర్‌బీఐ పంపిన రిస్కుల మదింపు నివేదిక (ఆర్‌ఏఆర్)లోని డైవర్జెన్స్ వివరాలు లీకవడం లేదా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున వార్షిక ఫలితాలను ప్రకటించే దాకా ఆగకుండా సత్వరం వెల్లడించినట్లు వివరించింది.
ఎక్సే్చంజీలు, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే ఎలాంటి చర్యలకూ పాల్పడలేదని స్పష్టం చేసింది. 2017–18లో మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో ముందుగా భావించినట్లు వ్యత్యాసాలేమీ లేవని రిజర్వ్ బ్యాంక్ తేల్చిందంటూ యస్ బ్యాంక్ గత వారంలో ప్రకటించడం, దీంతో షేరు ఒక్కసారిగా ఎగియడం తెలిసిందే. విశ్వసనీయమైన నివేదికను బహిరంగపర్చినందుకు చర్యలు ఉంటాయంటూ ఆర్‌బీఐ హెచ్చరించడంతో బ్యాంక్ తాజా వివరణనిచ్చింది.