ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్ గ్రూప్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 11 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.112 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,215 కోట్లకు ఎగసిందని టాటా మోటార్స్ తెలిపింది. గత క్యూ3లో ‘లో బేస్ ఎఫెక్ట్’ ఉన్న కారణంగా ఈ క్యూ3లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం ఆదాయం రూ.63,933 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.74,156 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ, సీఈఓ గుంటర్ బుశ్చెక్ చెప్పారు.
ఇబిటా 80 శాతం వృద్ధితో రూ.8,671 కోట్లకు, ఇబిటా మార్జిన్ 4.2 శాతం వృద్ధితో 11.7 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. అయితే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) పేలవమైన పనితీరు కారణంగా కన్సాలిడేటెడ్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయన్నది నిపుణుల మాట. వాణిజ్య వాహనాల విక్రయాల జోరు, వ్యయ నియంత్రణ ప్రయత్నాలు కలసిరావడంతో దేశీయ వ్యాపారం మాత్రం మంచి వృద్ధిని సాధించిందని వారు పేర్కొన్నారు.
స్డాండెలోన్ ఆదాయం 58 శాతం అప్..
స్డాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ ఆదాయం 58% పెరిగిందని గుంటర్ బుశ్చెక్ చెప్పారు. స్డాండెలోన్ ప్రాతిపదికన రూ.16,102 కోట్ల ఆదాయంపై రూ.184 కోట్ల నికర లాభం సాధించామన్నారు. ‘‘గత క్యూ3లో రూ.1,052 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.295 కోట్ల చొప్పున నికర నష్టాలు వచ్చాయి.
ఇబిటా 77 రెట్లు పెరిగి రూ.1,383 కోట్లకు, ఇబిటా మార్జిన్ 8.4 శాతం వృద్ధితో 8.6%కి చేరాయని వివరించారు. టర్న్ అరౌండ్ వ్యూహం మంచి ఫలితాలనిస్తోంది. కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడం, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా మోడళ్లను అందించడం తదితర కారణాల వల్ల లాభదాయకత మెరుగుపడింది’’ అని చెప్పారు.
నిరాశపరిచిన జేఎల్‌ఆర్..
ఈ కంపెనీ కామధేనువు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫలితాలు నిరాశపరిచాయి. గత డిసెంబర్ క్వార్టర్లో 25.5 కోట్ల పౌండ్లుగా ఉన్న స్థూలలాభం ఈ క్యూ3లో 19.2 కోట్ల పౌండ్లకు తగ్గింది. ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో 630 కోట్ల డాలర్లకు పెరిగింది. నిర్వహణ లాభాల మార్జిన్ 1.6 శాతం వృద్ధితో 10.9 శాతానికి పెరిగింది. చైనా, ఇతర విదేశాల్లో జేఎల్‌ఆర్ అమ్మకాలు బాగా ఉన్నాయని గుంటర్ బుశ్చెక్ చెప్పారు. అయితే డీజిల్ ఇంధనం, బ్రెగ్జిట్ తదితర అంశాలపై అనిశ్చితి కారణంగా ఇంగ్లండ్, అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
సిద్ధంగా ఉన్నాం...: దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు 18%, వాణిజ్య వాహనాల అమ్మకాలు 34% వృద్ధి చెందాయని, మొత్తం అమ్మకాలు 29% వృద్ధితో 1,32,000కు పెరిగాయని బుశ్చెక్ తెలిపారు. బీఎస్–6 కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు వంటి అం శాలు వాహన పరిశ్రమపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపనున్నాయని, ఈ సమస్యలను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత టాటా మోటార్స్ ఫలితాలు వచ్చాయి. సోమవారం స్టాక్ మార్కెట్ నష్టపోయినా, క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాతో టాటా మోటార్స్ షేర్ 3% లాభంతో రూ.396 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment