
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫ్–గ్యాస్ క్రాకర్ ప్లాంటును తమ జామ్‌నగర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసింది. మిగతా ఉత్పత్తి ప్లాంట్లు మొదలైన వాటన్నింటితో కలిపి దీని సామర్థ్యం వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల మేర ఉంటుందని రిలయన్స్ తెలిపింది. ‘ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి పెద్ద రిఫైనరీ ఆఫ్–గ్యాస్ క్రాకర్ (ఆర్‌వోజీసీ) కాంప్లెక్స్‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఆర్‌ఐఎల్ పెట్రోకెమికల్స్ వ్యాపార లాభదాయకతకు, నిలకడగా రాణించేందుకు ఇది తోడ్పడగలదని చెప్పారు.
రిలయన్స్‌కి జామ్‌నగర్‌లో ఉన్న రెండు రిఫైనరీల నుంచి వచ్చే వాయువులను ప్రాసెస్ చేసి.. పెట్రోకెమికల్స్ ఉత్పత్తుల తయారీకి అనువైన ఎథిలీన్, ప్రొపిలీన్ తదితర ముడి రసాయనాలను అందించేందుకు ఇది తోడ్పడనుంది. ఆర్‌వోజీసీ నుంచి వచ్చే ఎథిలీన్‌ను.. మిగతా ప్లాంట్లలోకి మళ్లించి మోనో ఎథిలీన్ గ్లైకాల్, పాలీ ఎథిలీన్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఆర్‌వోజీసీ అందుబాటులోకి రావడంతో మొత్తం అయిదు సైట్లలో ఎథిలీన్ సామర్థ్యం దాదాపు ఏటా 4 మిలియన్ టన్నులకు చేరిందని కంపెనీ పేర్కొంది. దీంతో 2014లో దాదాపు 16 బిలియన్ డాలర్లతో చేపట్టిన భారీ విస్తరణ పనులు పూర్తయినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment