ఐపీవో సన్నాహాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్
ముంబై: వరుస ఐపీవోలకు అనిల్ అంబానీ గ్రూప్ ప్రణాళికలు వేసుకుంటోంది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (మ్యూచువ్ ఫండ్) వచ్చే మార్చిలోపు ఐపీవోకు రానున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఐపీవోకు వెళ్లాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థలకూ మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కావడం గమనార్హం. ఐపీవోకు బోర్డు ఆమోదం తెలిపిందని, ఐఆర్డీఏ, సెబీ అనుమతుల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి చివరికి కంపెనీ పుస్తక విలువ రూ.1,250 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.130 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఐపీవో ద్వారా సమకూరే నిధులను వ్యాపార విస్తరణ, విలీనాలు, కొనుగోళ్ల కోసం వినియోగించుకోవాలన్న అభిప్రాయంతో ఉంది. ఇక, వాటా విక్రయం ద్వారా వ్యూహాత్మక భాగస్వామిని చేర్చుకోవాలన్న ప్రయత్నాల్లోనూ ఉన్నట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్‌జైన్ వెల్లడించారు.