Reliance Nippon Life Asset
-
రిలయన్స్ నిప్పన్...17% లాభంతో లిస్టింగ్
ముంబై: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్‌ఎన్‌ఏఎమ్) షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపిం చినప్పటికీ, ఆ లాభాలను చివరి వరకూ కొనసాగించలేకపోయాయి. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర రూ.252తో పోలిస్తే 17 శాతం లాభంతో రూ.296 వద్ద లిస్టయింది. ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.299, రూ.278 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 13 శాతం లాభంతో రూ.284 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.17,381 కోట్లకు చేరింది. రూ.1,540 కోట్ల ఈ ఐపీఓ 82 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్ ఫండ్ ఇదే. ఇక నిర్వహణ ఆస్తుల పరంగా చూస్తే, రూ.3.84 లక్షల కోట్ల ఆస్తులతో మూడో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా అవతరించింది. మరిన్ని నిప్పన్ పెట్టుబడులు...: త్వరలో మరిన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌ను అందించనున్నామని ఆర్‌ఎన్‌ఏఎమ్ సీఈఓ సందీప్ సిక్కా పేర్కొన్నారు. ప్రస్తుతం 135 నగరాల్లో 171 బ్రాంచీలున్నాయని, మూడేళ్లలో వీటిని 500కు పెంచనున్నామని వివరించారు. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఆకర్షణీయంగా ఉందని, పెట్టుబడులు కొనసాగిస్తామని నిప్పన్ లైఫ్ వైస్ చైర్మన్ తకెషి ఫ్యూరిచి చెప్పారు. -
రిలయన్స్ ఏఎంసీ కొనుగోళ్ల నిధి
న్యూఢిల్లీ: ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థల కొనుగోలు కోసం రూ. 165 కోట్ల మేర నిధులను కేటాయించనున్నట్లు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) డిప్యూటీ సీఈవో హిమాంశు వ్యాపక్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్ రంగంలో మొత్తం 54 సంస్థలు ఉండగా.. వీటిలో దాదాపు సగం నష్టాలే నమోదు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నిధుల్లో రూ. 165 కోట్లను వేరే ఫండ్ సంస్థల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు వ్యాపక్ చెప్పారు. అక్టోబర్ 25–27 మధ్యలో ఐపీవోకి రానున్న రిలయన్స్ నిప్పన్ లైఫ్ రూ. 1,542 కోట్లు దాకా సమీకరించనుంది. షేరు ధర శ్రేణిని రూ. 247–252గా నిర్ణయించింది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో లిస్టింగ్‌కి వస్తున్న కంపెనీల్లో ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ ఐపీవోలో రిలయన్స్ క్యాపిటల్, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ చెరి మూడు శాతం వాటాలు (సుమారు 3.67 కోట్ల షేర్లు) ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుండగా, కొత్తగా మరో 2.45 కోట్ల షేర్లను సంస్థ జారీ చేయనుంది. -
ఐపీవో సన్నాహాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్
ముంబై: వరుస ఐపీవోలకు అనిల్ అంబానీ గ్రూప్ ప్రణాళికలు వేసుకుంటోంది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువ్ ఫండ్) వచ్చే మార్చిలోపు ఐపీవోకు రానున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఐపీవోకు వెళ్లాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థలకూ మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కావడం గమనార్హం. ఐపీవోకు బోర్డు ఆమోదం తెలిపిందని, ఐఆర్డీఏ, సెబీ అనుమతుల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లిస్టింగ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి కంపెనీ పుస్తక విలువ రూ.1,250 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.130 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఐపీవో ద్వారా సమకూరే నిధులను వ్యాపార విస్తరణ, విలీనాలు, కొనుగోళ్ల కోసం వినియోగించుకోవాలన్న అభిప్రాయంతో ఉంది. ఇక, వాటా విక్రయం ద్వారా వ్యూహాత్మక భాగస్వామిని చేర్చుకోవాలన్న ప్రయత్నాల్లోనూ ఉన్నట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్‌జైన్ వెల్లడించారు.