గిట్టుబాటు రేటు ఉంటేనే
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ధరను నిర్ధారించడాన్ని బట్టి గ్యాస్ ప్రాజెక్టుల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుల్లో ఆర్‌ఐఎల్ భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ తమ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయం వెల్లడించింది. ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్యాస్ రేటుపై సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.
ఒడిషా తీరంలోని ఎన్‌ఈసీ-25, ఇటు కృష్ణా-గోదావరి బేసిన్‌లోని కేజీ-డీ6 బ్లాక్‌లలో ఆర్‌ఐఎల్ కొత్తగా మరిన్ని గ్యాస్ నిక్షేపాలను కనుగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూనిట్‌కు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ రేటును 8.4 డాలర్లకు పెంచే ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తడం, ఎన్నికలు నేపథ్యంలో వెనక్కి తగ్గింది. కొత్త ప్రభుత్వం సైతం సమగ్ర సమీక్ష జరపాలంటూ వాయిదా వేసింది. దీనిపై ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.