సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఆందోళనల కారణంగా స్టాక్‌మార్కెట్ల భారీ పతనానికి తోడు, సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ షాక్ ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)ను భారీగా తాకింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆర్‌ఐఎల్ షేరు 12 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా సోమవారం అత్యంత ఘోరంగా పడిపోయింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్‌ఈలో 13.65 శాతం పతనమై రూ.1,094.95 కు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 18శాతం కోల్పోయింది. తత్ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా భారీగా నష్టపోయి రూ. 7 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ క్యాప్ పరంగా ఐటీ మేజర్ టీసీఎస్ రూ .7.31 లక్షల కోట్లతో టాప్‌లోకి వచ్చింది.
మార్కెట్ క్యాప్ పరంగా రూ .10 లక్షల కోట్లను అధిగమించి తొలి కంపెనీగా అవతరించిన ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం, 2019 డిసెంబర్‌లో సాధించిన రికార్డు స్థాయిల నుంచి రూ .2.7 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. గత ఏడాది డిసెంబరులో ఆర్‌ఐఎల్ షేరు రూ .1,617 వద్ద 52 వారాల గరిష్ట స్థాయి తాకింది. అప్పటి నుండి ఇది 522 పాయింట్లు లేదా 32 శాతం కుప్పకూలింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు నష్టాన్ని నమోదు చేసింది. కీలక సూచీ సెన్సెక్స్ 2,450 పాయింట్లు, నిఫ్టీ 6.15శాతం కుప్పకూలింది. ముడి చమురు ధరలు 29 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రభుత్వ రంగ ఆయిల్ స్టాక్స్ 13 శాతం ఎగియడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment