
వొడాఫోన్‌పై నోట్ల రద్దు, జియో ఎఫెక్ట్
లండన్: పెద్ద నోట్ల రద్దు, రిలయన్స్ జియో ఉచిత సేవలతో డిసెంబర్ త్రైమాసికంలో భారత కార్యకలాపాలకు సంబంధించి సేవల ఆదాయానికి గండిపడినట్లు టెలికం దిగ్గజం వొడాఫోన్ వెల్లడించింది. ‘కొత్తగా ప్రవేశించిన టెలికం సంస్థ ఉచిత సర్వీసులు అందించడంతో భారత్‌లో టెలికం రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. మా పరంగా దక్షిణాఫ్రికా, టర్కీలో మెరుగైన పనితీరు కనపర్చినప్పటికీ.. భారత్‌లో పరిణామాలతో ఆ ప్రయోజనాలు దక్కలేదు’ అని పేర్కొంది.
ఆదాయాలను మెరుగుపర్చుకోవడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో బాగంగా 17 ప్రధాన సర్కిల్స్‌లో 4జీ సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, ఐడియా, వొడాఫోన్ ఇండియా విలీన ప్రతిపాదనపై ఆదిత్య బిర్లా గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది. మూడో త్రైమాసికంలో వొడాఫోన్ భారత కార్యకలాపాలకు సంబంధించి ఆదాయం 1.9% తగ్గింది. మరోవైపు, ధరలపరమైన పోటీ కారణంగా బ్రిటన్‌లో కూడా ఆదాయాలు తగ్గినట్లు వొడాఫోన్ పేర్కొంది. గ్రూప్ మొత్తం ఆదాయం 3.9 శాతం తగ్గి 13.7 బిలియన్ యూరోలుగా నమోదు కాగా, సేవల విభాగం ఆదాయం 12.3 బిలియన్ యూరోలుగా నమోదైంది.