జియో ఉచితం డిసెంబర్ 3 వరకే... | Reliance Jio free service offer available for subscription only till 3 December | Sakshi
Sakshi News home page

జియో ఉచితం డిసెంబర్ 3 వరకే...

Published Fri, Oct 21 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

జియో ఉచితం డిసెంబర్ 3 వరకే...

జియో ఉచితం డిసెంబర్ 3 వరకే...

తర్వాత కొనసాగిస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే
కొనసాగించేవారికే డిసెంబర్ 31 వరకూ ఉచితం
ఆ రోజుతో అందరికీ ఉచిత సేవలు బంద్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తన కస్టమర్లందరికీ 4జీ డేటా, వాయిస్ కాల్స్‌ను అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో... ఈ ఉచిత సేవలకు కటాఫ్ తేదీగా డిసెంబరు 3ను నిర్ణయించింది. రిలయన్స్ జియో సేవలకు ఛార్జీలు చెల్లించకూడదని, జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు డిసెంబరు 3లోగా ఆ విషయాన్ని జియో స్టోర్లలో తెలియజేసి, అధికారికంగా సిమ్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సిమ్‌ను సరెండర్ చేయని పక్షంలో... వారికి డిసెంబరు 31వరకూ ఉచిత సేవలు కొనసాగుతాయి.

ఆ తరవాత మాత్రం నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి. జియో ఉచిత సేవలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4 నుంచి అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు జియో ఉచిత సేవలు 90 రోజులకే పరిమితమని, ఇవి డిసెంబర్ 3తో ముగిసిపోతాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జియో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

 జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత కాల్స్, డేటా ప్రయోజనాలు కస్టమర్లందరికీ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని జియో అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆఫర్ పొందే అవకాశం డిసెంబర్ 3 వరకే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఆ లోపు కనెక్షన్ తీసుకోని వారు ఆ తర్వాత నుంచి అందుబాటులో ఉన్న నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు పొందాల్సి ఉంటుందన్నారు. జియో వినియోగదారులకు సౌకర్యంతో కూడిన స్నేహపూరిత సేవలు ఇకపైనా అందిస్తామన్నారు. 

రిలయన్స్ జియో సేవలను సెప్టెంబర్ 1న కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించటం తెలిసిందే. జియో కస్టమర్లకు జీవితకాలం పాటు కాల్స్ ఉచితంగానే అందిస్తామని, కేవలం డేటా చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఉచిత కాల్స్ సేవలు డిసెంబర్ 31 తర్వాత అందుతాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే డిసెంబర్ 4 తర్వాత పొందే సేవలకు వసూలు చేసే ఛార్జీలెంతన్నది కంపెనీ ఇప్పటికీ పేర్కొనకపోవడం గమనార్హం.

 జియో టారిఫ్‌లు నిబంధనల మేరకే: ట్రాయ్
రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. జియో టెలికం సేవల టారిఫ్ ప్లాన్లు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన లేదని ప్రత్యర్థి కంపెనీలకు తెలియజేసింది. జియో ఉచిత కాల్స్ సేవలు నిబంధలకు విరుద్ధమంటూ టెలికం సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా స్పష్టతనిచ్చింది.

కాగా, టెలికం కంపెనీలు పోటీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ రిలయన్స్ జియో ప్రత్యర్థులపై తాజాగా ఆరోపణలుకు దిగింది. తమ నెట్‌వర్క్ నుంచి వెళుతున్న కాల్స్‌లో 75 శాతం ఫెయిల్ అవుతున్నాయని పేర్కొంది. తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య అని తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement