రిలయన్స్ జియో వాణిజ్య సేవలెప్పుడు?
త్వరలో అంటున్న ముకేశ్ అంబానీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జియో’ పూర్తిస్థాయి వాణిజ్య సేవలను రానున్న నెలల్లో ప్రారంభిస్తామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. కానీ కచ్చితంగా ఎప్పుడు ఆవిష్కరిస్తామనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఏడాది కాలంగా జియో నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాపన, బిజినెస్ సర్వీసెస్ అండ్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు పూర్తి దిశగా పనిచేశామని పేర్కొన్నారు. జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని తెలిపారు.
ఈ విషయాల గురించి ఆయన కంపెనీ 2015-16 వార్షిక నివేదికలో ప్రస్తావించారు. జియో నెట్‌వర్క్ సహా యూజర్ అప్లికేషన్స్, సర్వీసెస్ వంటి తదితర సేవలను పరీక్షించామని తెలిపారు. టెస్ట్ యూజర్లు మంచి ఫీడ్‌బ్యాక్‌ను అందించారని పేర్కొన్నారు. ప్రస్తుత సర్వీసులను త్వరలోనే పూర్తి వాణిజ్య స్థాయి సేవలుగా అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. కంపెనీ 2015-16లో వివిధ కార్యకలాపాల కోసం రూ.1,12,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిందని, దేశంలో మరే ఇతర కంపెనీ కూడా భవిష్యత్తు వృద్ధి కోసం ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదని వివరించారు. కాగా షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశం సెప్టెంబర్ 1న బిర్లా మాతోశ్రీ సభాగర్ ఆడిటోరియంలో ఉంటుందని కంపెనీ పేర్కొంది.