
రిలయన్స్ జియో 4G సేవలు ప్రారంభం...కానీ..
దేశంలో సెల్ వినియోగంలో విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎట్ట కేలకు తన జీయో సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభించింది. సాధారణ ప్రజలకు 4జీ సేవలను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడో మెలిక ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఆహ్వానం ఉంటేనే జియో సిమ్ కొనుక్కోవడానికి వీలవుతుంది. లేదంటే రిలయన్స్ డిజిటల్‌లో లైఫ్ మొబైళ్లను కొనుగోలు చేసినా, ఈ జియో 4జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే ఈ మొబైల్స్ మొబైళ్లు రూ.5,599- 19,499 ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
వాణిజ్యపరమైన ప్రారంభానికి దగ్గరపడుతున్న నేపథ్యంలో..మా నెట్‌వర్క్‌ను పరీక్షించేందుకు వీలుగా ఆప్తులకు, సన్నిహితులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నామని పేర్కొంది. ఈ పథకంలో భాగంగా రిలయన్స్ జియో 4జీ సిమ్ లేదా లైఫ్ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థ ఉద్యోగి గరిష్ఠంగా 10 మందిని ఆహ్వానించవచ్చు. కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు 90 రోజుల పాటు అపరిమిత 4జీ మొబైల్ ఇంటర్నెట్, ఫోన్ కాల్స్‌ను కంపెనీ అందిస్తుంది. అన్నట్టు ఈ సేవలను యాక్టివేట్ చేసుకునేందుకు ఆహ్వానం పొందిన వ్యక్తి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
వీటితో పాటు జియోకు చెందిన 4జీ యాప్‌లు జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియోమ్యాగ్, జియో బీట్స్, జియో డ్రైవ్ వంటి వాటిని 90 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అటు ప్రయోగాత్మక దశ(ట్రయల్ ఫేజ్) లో తమ నెట్‌వర్క్‌ను 5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నారని ఆర్ ఐఎల్ ఇటీవల ప్రకటించింది. మొదటి నెలలో 18జీబీకిపైన, అలాగే 250 నిమిషాలకు పైగా వాయిస్ సర్వీసులను వాడుకుంటున్నట్టు తెలిపింది. ఇకో ఫ్రెండ్లీ దిశగా తమ ప్రయోగాలు సాగుతున్నాయని పేర్కొంది.
కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ.200లు ఖరీదు చేసే సిమ్ ద్వారా 75జీబీ 4జీ డేటాతో పాటుగా 4500 నిముషాల ఫ్రీ కాల్స్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.