
ముంబై : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఊరట కలిగించేలా పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ జియో కూడా ఆ జాబితాలో చేరింది. జియో ఫోన్ వినియోగదారులు ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల కాల్స్, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చునని తెలిపింది. అలాగే జియో ఫోన్ వినియోగదారుల ప్రీపైయిడ్ వ్యాలిటిడీ పూరైనప్పటికీ.. వారికి ఏప్రిల్ 17 వరకు ఇన్‌కమింగ్ కాల్స్ సేవలు అందజేస్తామని తెలిపింది. జియో ఫోన్లు వాడుతున్న కొన్ని లక్షల మంది తమ బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి, ఒకవేళ అవసరమైతే హెల్త్‌కేర్ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.
కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున్న ఆఫ్‌లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే జియో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా జియో వినియోగదారులు సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ఎస్‌ఎంఎస్ బ్యాకింగ్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, కరోనావైరస్ కట్టడిపరమైన లాక్‌డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment