
న్యూఢిల్లీ: కృష్ణా–గోదావరి బేసిన్‌లోని ప్రధాన చమురు–గ్యాస్ క్షేత్రాల(కేజీ–డీ6)ను మూసివేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) సమాయత్తమవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అంతకంతకూ దిగజారుతూ కొత్త కనిష్టాలకు పడిపోతుండమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. గతేడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లకు వెల్లడించిన సమాచారంలో ఈ అంశాలను ఆర్‌ఐఎల్ తెలిపింది. ‘కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేజీ–డీ6లోని ప్రధాన ఉత్పత్తి క్షేత్రాలను(డీ1, డీ3, ఎంఏ) వచ్చే కొద్ది నెలల్లో మూసివేయనున్నాం. ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసేందుకు(డీకమిషనింగ్) వీలుగా బ్యాంక్ గ్యారంటీలను కూడా సమర్పించాం’ అని వివరించింది.
కొత్తగా మూడు మొదలు...
కేజీ బేసిన్‌లో ఆర్‌ఐఎల్ ఇప్పటివరకూ 19 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. ఇందులో ఒకే ఒక చమురు క్షేత్రమైన ఎంఏ నుంచి 2008 సెప్టెంబర్‌లో క్రూడ్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇక ధీరూభాయ్ 1, 3(డీ1, డీ3) క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2009 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కేజీ–డీ6లో రోజుకు 4.3 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.9 ఎంఎస్‌సీఎండీల ఉత్పత్తి కంటే మరింత పడిపోయింది. 2010 మార్చిలో డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి 69.43 ఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకింది. కాగా, ఎంఏ చమురు క్షేత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌నాటికి మూసివేసే అవకాశం ఉందనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రాలను మూసివేయాలంటే ఏడాది ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ప్రస్తుతం మూడు నిక్షేపాల వెలికితీత పనులు కొనసాగుతున్నాయని ఆర్‌ఐఎల్ తెలిపింది. ఈ మూడింటిపై(ఆర్–క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే క్షేత్రాలు) రూ.40,000 కోట్లను పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. వీటినుంచి గరిష్టంగా 30–35 ఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, 2020 నుంచి ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వివరించింది. ఆర్–క్లస్టర్‌లో బావుల తవ్వకం(డ్రిల్లింగ్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో ప్రారంభిస్తామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment