
రిలయన్స్ లాభాల రికార్డ్!
♦ క్యూ4లో రూ. 7,398 కోట్లు; 16 శాతం జంప్
♦ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్ల జోరు...
♦ ఆదాయం రూ. 64,569 కోట్లు; 9 శాతం తగ్గుదల
♦ స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.8 డాలర్లు...
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) రికార్డు లాభాలతో అదరగొట్టింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.7,398 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,381 కోట్లతో పోలిస్తే 16 శాతం ఎగబాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో మార్జిన్లు జోరందుకోవడం భారీ లాభాలకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది. కాగా, గడిచిన ఎనిమిదేళ్లలో రిలయన్స్‌కు ఒక క్వార్టర్‌లో ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం. 2007-08 ఏడాది మూడో త్రైమాసికంలో రిలయన్స్ రూ.8,079 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే ఇప్పటివరకూ అత్యంత గరిష్టస్థాయి. కాగా, క్యూ4లో కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం 9 శాతం దిగజారి రూ.64,569 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 70,863 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు భారీగా పడిపోవడం ఆదాయం తగ్గేందుకు ప్రధానం కారణమని కంపెనీ పేర్కొంది.
జీఆర్‌ఎం జోష్...
రిలయన్స్ ప్రధానవ్యాపారాల్లో కీలకమైన రిఫైనింగ్ రంగం మెరుగైన పనితీరును కొనసాగిస్తోంది. క్యూ4లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) 10.8 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 10.1 డాలర్లు. సింగపూర్ ప్రామాణిక జీఆర్‌ఎంతో పోలిస్తే రిలయన్స్ జీఆర్‌ఎం 3.1 డాలర్లు అధికం. కాగా, డిసెంబర్ క్వార్టర్‌లో జీఆర్‌ఎం 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేసి పెట్రోలియం ఇంధనాలుగా మార్చడం ద్వారా కంపెనీకి లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. కాగా, 2015-16 పూర్తి ఏడాదికి కూడా 10.8 డాలర్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది జీఆర్‌ఎం 8.6 డాలర్లు.
పూర్తి ఏడాదికీ రికార్డే...
2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 27,630 కోట్లకు ఎగసింది. 2014-15లో లాభం రూ.23,566 కోట్లతో పోలిస్తే 17.2 శాతం వృద్ధి చెందింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌కు ఇదే అత్యధిక నికర లాభంగా కూడా రికార్డు నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం పూర్తి ఏడాదికి రూ.2,96,091 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది ఆదాయం రూ.3,88,494 కోట్లతో పోలిస్తే.. 23.8 శాతం దిగజారింది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
♦ స్టాండెలోన్ ప్రాతిపదికన(కీలకమైన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు) రిలయన్స్ నికర లాభం క్యూ4లో 17.2 శాతం ఎగబాకి రూ.7,320 కోట్లకు చేరింది.
♦ రిఫైనింగ్ వ్యాపారంలో కూడా క్యూ4లో రికార్డు స్థాయిలో రూ.6,394 కోట్ల పన్ను ముందు(స్థూల) లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30.4 శాతం వృద్ధి చెందింది.
♦ పెట్రోకెమికల్స్ రంగంలో స్థూల లాభం 35.4 శాతం వృద్ధితో రూ.2,713 కోట్లకు దూసుకెళ్లింది.
♦ చమురు, గ్యాస్ వ్యాపారం స్థూల లాభం ఏకంగా 84.4 శాతం దిగజారి రూ.14 కోట్లకు పడిపోయింది. కేజీ-డీ6లో ఉత్పత్తి ఘోరంగా దిగజారడం, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్, గ్యాస్ ధరలను తగ్గించడం వంటివి ఈ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని కంపెనీ తెలిపింది.
♦ ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.1,81,079 కోట్లకు పెరిగింది. గతేడాది మార్చి చివరికి ఇది రూ. 1,60,860 కోట్లు. ఇక కంపెనీ నగదు నిల్వలు మార్చి చివరికి కల్లా రూ.86,033 కోట్లుగా ఉన్నాయి.
♦ రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగం క్యూ4లో రూ.235 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. క్రితం క్యూ4తో పోలిస్తే 17.4% పెరిగింది. ఆదాయం 21% వృద్ధితో రూ.5,781 కోట్లకు ఎగసింది. 2015-16 పూర్తి ఏడాదికి ఈ వ్యాపార ఆదాయం 22.4% వృద్ధి చెంది రూ.21,612 కోట్లకు చేరింది. గడిచిన ఏడాదిలో కొత్తగా 624 స్టోర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 532 నగరాలు/పట్టణాల్లో 3,245కు చేరింది.
♦ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక రిలయన్స్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పనష్టంతో రూ.1,039 వద్ద ముగిసింది.
ఈ ఏడాదే రిలయన్స్ జియో..
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(హైడ్రోకార్బన్స్) వ్యాపారంలో గత ఆర్థిక సంవత్సరం అధ్బుతమైన పనితీరును సాధించాం. ఈ రెండు విభాగాల్లో రికార్డు స్థాయి రాబడులను నమోదుచేశాం. రిఫైనరీల్లో ఉత్పాదకత సామర్థ్యాన్ని మించడంతో రెండంకెల జీఆర్‌ఎంలను కొనసాగించగలిగాం. ఈ ఏడాది వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న రిలయన్స్ జియో 4జీ సేవలతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజలను డిజిటల్‌గా అనుసంధానం చేయనున్నాం (అయితే, ఎప్పటి నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు). మా కంపెనీతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి ఈ సేవలు చేదోడుగా నిలుస్తాయి.
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ
ఈ ఏడాది రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడి
ఈ ఏడాది(2016-17) రూ.1.5 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులను వెచ్చించనున్నట్లు ఆర్‌ఐఎల్ గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. శ్రీకాంత్ వెల్లడించారు. గతేడాది(2015-16)లో రూ.1.2 లక్షల కోట్లను వెచ్చించినట్లు చెప్పారు. జామ్‌నగర్‌లోని రిఫైనరీ, విస్తరణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.50,000-60,000 కోట్లు, రిలయన్స్ జియో టెలికం నెట్‌వర్క్ కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా మొత్తంలో రిటైల్ వ్యాపార విస్తరణకు రూ.3,500 కోట్లు ఇతరత్రా వ్యాపారాలకుగాను వెచ్చించనున్నట్లు శ్రీకాంత్ వివరించారు.