మూడేళ్లలో 1.8 లక్షల కోట్లు...
ఏజీఎంలో భారీ పెట్టుబడుల ప్రణాళికను ఆవిష్కరించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
* వచ్చే ఏడాది 4జీ టెలికం సేవలు షురూ...
* ప్రపంచ టాప్-50 కంపెనీల్లో ఒకటిగా నిలవడమే లక్ష్యం
* కంపెనీలో తొలి మహిళా డెరైక్టర్‌గా నీతా అంబానీ
ముంబై: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో వివిధ వ్యాపార విభాగాల్లో రూ.1.8 లక్షల కోట్ల మొత్తాన్ని వెచ్చించనున్నట్లు బుధవారమిక్కడ జరిగిన 40వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కంపెనీ సీఎండీ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ప్రపంచంలోని టాప్-50 కంపెనీల్లో ఒకటిగా ఆర్‌ఐఎల్‌ను నిలపడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పెట్రోకెమికల్ యూనిట్లు, ఇంధన వ్యాపార విస్తరణ, మరిన్ని రిటైల్ స్టోర్‌ల ఏర్పాటు టెలికం రంగానికి సంబంధించి ప్రణాళికలన్నింటినీ వివరించారు. తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులతోసహా ఆయన ఏజీఎంకు హాజరయ్యారు.
బ్రాడ్‌బ్యాండ్ బాజా...
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 4జీ టెలికం సేవలను ప్రారంభించనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ను రూ.4,800 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆర్‌ఐఎల్.. దేశవ్యాప్త వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ లెసైన్స్(డబ్ల్యూబీఏ-4జీ) స్పెక్ట్రం లెసైన్స్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.12,847 కోట్లు ఖర్చు చేసింది. తదనంతరం టెలికం విభాగానికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌గా పేరు పెట్టింది. 2015లో దశలవారీగా 5,000 నగరాలు, 2,15,000 గ్రామాల్లో 4జీ సేవలను మొదలుపెడతామని ముకేశ్ ప్రకటించారు. క్రమంగా దేశంలోని ఆరు లక్షలకు పైగా గ్రామాలను వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేసేవిధంగా టెలికం రంగంలో రూ.70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. ‘4జీ సేవల కోసం మేం అత్యాధునిక లాంగ్ టర్మ్ ఇవల్యూషన్(ఎల్‌టీఈ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం.
దీనివల్ల డిజిటల్ సాంకేతికతలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు దోహదం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలకంటే భారతీయులకు అత్యంత అధునాతన కనెక్టివిటీ, టెలికం సేవలను అందించేందుకు 4జీ సేవలు ఉపయోగపడతాయి.’ అని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో క్షేత్రస్థాయి ట్రయల్స్‌ను ప్రారంభించనున్న రిలయన్స్ జియో... 2015లో పూర్తిస్థాయిలో సేవలను ప్రవేశపెట్టనుంది. మరోపక్క, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.11,054 కోట్ల వ్యయంతో 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో(2జీ) స్పెక్ట్రంను కూడా ఆర్‌ఐఎల్ కొనుగోలు చేసింది. దీనిద్వారా వాయిస్ కాల్ సేవలను కూడా అందించేందుకు వీలవుతుంది. అయితే, ఈ స్పెక్ట్రంను 4జీ సేవలకు కూడా వినియోగించుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. 4జీ ద్వారా టీవీ సేవలను సైతం అందించే ప్రణాళికల్లో రిలయన్స్ జియో ఉంది.
గత 37 ఏళ్లలో పెట్టుబడి రూ. 2,4 లక్షల కోట్లు...
వచ్చే రెండేళ్లపాటు ఏటా రూ.60 వేల కోట్ల చొప్పున రుణాలను ఆర్‌ఐఎల్ సమీకరించనుందని, అయితే 2017 నాటికి కంపెనీవద్దనున్న నగదు తత్సమాన నిల్వలు, రుణాలను లెక్కగడితే.. రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించనున్నామని ముకేశ్ వెల్లడించారు. ‘స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత గత 37 ఏళ్ల ప్రయాణంలో ఆర్‌ఐఎల్ రూ.2,4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే మూడేళ్లలోనే మరో రూ.1.8 లక్షల కోట్లను వెచ్చించనున్నాం. పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, రిటైల్, టెలికం రంగాల్లో వ్యయాలన్నీ సగంలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఇవన్నీ కార్యరూపం దాల్చి ప్రతిఫలం అందుకోనున్నాం.
గత 37 ఏళ్లలో సాధించినదానికి మించిన ప్రగతిని రాబోయే మూడేళ్లలో మనం అందుకోగలమన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఇవన్నీ సాకారమైతే ఫార్చూన్ 50 జాబితాలో చోటుదక్కించుకోవాలన్న మన లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది’ అని ఇన్వెస్టర్లకు ముకేశ్ వివరించారు. ఫార్చూన్ 500 ప్రపంచ దిగ్గజ కంపెనీల జాబితాలో ప్రస్తుతం రిలయన్స్ 135వ స్థానంలో ఉంది.
గ్యాస్, చమురు ఉత్పత్తి పెంపునకు చర్యలు..
కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్, చమురు ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని ముకేశ్ పేర్కొన్నారు. మరోపక్క, మధ్యప్రదేశ్‌లోని కోల్‌బెడ్ మీథేన్(సీబీఎం) బ్లాక్‌ల నుంచి గ్యాస్ ఉత్పత్తి 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని కూడా ఆయన వెల్లడించారు. బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)తో భాగస్వామ్యంతో కేజీ-డీ6, సీవైడీ5 బ్లాక్‌లలో రెండు కీలక నిక్షేపాలను కనుగొన్నామని కూడా చెప్పారు. ఈ వనరులను వెలికితీసేందుకు నియంత్రణపరమైన అనుమతులు సకాలంలో రావడం, మార్కెట్ ఆధారిత గ్యాస్ ధరలు చాలా ముఖ్యమన్నారు.
ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరల పెంపునకు సంబంధించి ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) చర్యలను ప్రారంభించామని... గతంలో ఆర్‌ఐఎల్‌పై విధించిన జరిమానాలకు సంబంధించి మొదలుపెట్టిన ఆర్బిట్రేషన్ ప్రక్రియకు ఇది అదనమని కూడా చెప్పారు. కాగా, ఈ రెండు అంశాల్లో తగిన, సత్వర పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామన్నారు. కాగా, గ్యాస్ ధర పెంపుపై కొన్ని రాజకీయపక్షాల నుంచి వెలువడుతున్న తీవ్ర విమర్శలపై స్పందిస్తూ... తాము అన్ని విషయాల్లోనూ పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. సంపద సృష్టి, దేశ అవసరాలను తీర్చడంలో ప్రజల విశ్వాసాన్ని ఆర్‌ఐఎల్ పొందగలదన్న పూర్తి విశ్వాసం తనకుందని పేర్కొన్నారు.
బోర్డులోకి నీతా అంబానీ..
రిలయన్ కంపెనీ డెరైక్టర్ల బోర్డులోకి ముకేశ్ భార్య నీతా అంబానీ అడుగుపెట్టనున్నారు. ఆమె నియామకానికి ఏజీఎంలో వాటాదారుల ఆమోదం లభించింది. తద్వారా కంపెనీలో తొలి మహిళా డెరైక్టర్‌గా ఆమె స్థానం సంపాదించారు. ప్రతి కంపెనీలో ఒక మహిళా డెరైక్టర్‌ను తప్పనిసరిచేస్తూ కొత్త కంపెనీల చట్టంలో నిబంధనలను పాటించేందుకు కూడా నీతా నియామకం దోహదం చేయనుంది. 50 ఏళ్ల నీతా ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
రిలయన్స్ రిటైల్, జామ్‌నగర్‌లో అత్యాధునిక కార్యాలయ సముదాయాలు, ప్రపంచస్థాయి టౌన్‌షిప్ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించడంతోపాటు.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ఐపీఎల్ క్రికెట్ టీమ్ ముంబై ఇండియన్స్‌లను విజయవంతంగా నిర్వహించడంలో తనదైన ముద్ర వేశారు. కాగా, నీతా నియామకంపై ముకేశ్ మాట్లాడుతూ... బోర్డులోకి ఆమెను ఆహ్వానిస్తున్నా. వ్యక్తిగతమైన ప్రతిభగల ఆమె రాకతో ఆర్‌ఐఎల్‌కు మరింత విలువ చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పదవిని అత్యంత వినయంతో, బాధ్యతతో నిర్వర్తిస్తానని నీతా అంబానీ పేర్కొన్నారు.
రిటైల్ జోరు...
ప్రతి 3-4 ఏళ్లకూ తమ రిటైల్ వ్యాపారాన్ని రెట్టింపు చేయడంపై దృష్టిసారిస్తున్నామని ముకేశ్ చెప్పారు. గత 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలపరంగా రిలయన్స్ రిటైల్ దేశంలోనే అతిపెద్ద రిటైలర్‌గా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది రిటైల్ వ్యాపార ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.14,496 కోట్లకు ఎగబాకింది. అంతేకాకుండా తొలిసారిగా బ్రేక్‌ఈవెన్‌ను సాధించి రూ.182 కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించింది. కాగా, ఆర్‌ఐఎల్ కన్సూమర్ విభాగానికి రానున్న రోజుల్లో రిటైల్ వ్యాపారమే ప్రధాన చోదకంగా పనిచేయనుందని చెప్పారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 146 నగరాల్లో 1,691 స్టోర్లను నిర్వహిస్తోంది.