మళ్లీ రిలయన్స్ బంకులు షురూ
న్యూఢిల్లీ: డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ తొలగింపు నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) బంకులు తెరుచుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ) సబ్సిడీ ధరల దెబ్బకు తట్టుకోలేక మూసేసిన వాటిలోని ఐదో వంతు(230)బంకుల్లో విక్రయాలను మళ్లీ ప్రారంభించినట్లు ఆర్‌ఐఎల్ వెల్లడించింది. మూడో క్వార్టర్ ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లకు ఈ విషయాన్ని తెలిపింది.
2008 మార్చి నాటికి ఆర్‌ఐఎల్ తనకున్న మొత్తం 1,432 బంకులనూ మూసివేసింది. కాగా, తమ మొత్తం బంకుల నెట్‌వర్క్‌ను ఏడాది వ్యవధిలో తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు డీజిల్ రేట్లపై నియంత్రణను తొలగించడం తెలిసిందే.
ఇప్పటికే ఎస్సార్ కూడా...: 2010 సంవత్సరం జూన్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో మరో ప్రైవేటు చమురు రిటైలర్ ఎస్సార్ తమకున్న 1,400 మేర అవుట్‌లెట్లలో పెట్రోలు విక్రయాలను ప్రారంభించింది. డీజిల్ డీకంట్రోల్ నేపథ్యంలో తమ బంకులన్నింటిలో డీజిల్ విక్రయాలను కూడా మొదలుపెట్టింది. దీంతోపాటు బంకుల సంఖ్యను 1,600కు పెంచుకుంది. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్యను 2,500కు చేర్చే ప్రయత్నాల్లో ఉంది.