మేక్ ఇన్ ఇండియాకు కార్పొరేట్లు సై | Remove hurdles to ‘Make in India’, industry tells Modi Government | Sakshi
Sakshi News home page

మేక్ ఇన్ ఇండియాకు కార్పొరేట్లు సై

Published Fri, Sep 26 2014 1:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

మేక్ ఇన్ ఇండియాకు కార్పొరేట్లు సై - Sakshi

మేక్ ఇన్ ఇండియాకు కార్పొరేట్లు సై

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. అయితే, ఈ నినాదం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా తయారు చేయాలన్న మోదీ సంకల్పం సాకారమవ్వాలంటే తీసుకోవాల్సిన పలు కీలక అంశాలను కూడా వారు గుర్తు చేశారు. స్థిరమైన పన్నుల వ్యవస్థ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు, విధానపరమైన నిర్ణయాల్లో వేగం వంటివి చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

 మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశంలో తయారీ రంగం పుంజుకుంటే.. భారీగా ఉద్యోగాల కల్పనతో పాటు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) తిరిగి అధిక వృద్ధి బాటలోకి వస్తుందని కార్పొరేట్లు అభిప్రాయపడ్డారు. కాగా, మోదీ మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని పారిశ్రామిక మండళ్లు స్వాగతించాయి. ప్రపంచ తయారీ కేంద్రంగా ఆవతరించే రేసులో ముందుండాలన్న భారత్ ఆకాంక్షను  ప్రతిబింబిస్తోందని పేర్కొన్నాయి.

 కార్ల తయారీ హబ్‌గా భారత్: మారుతీ
 కార్ల తయారీలో ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవించే సామర్థ్యం భారత్‌కు ఉందని మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా పేర్కొన్నారు. ‘భారత్‌లో వ్యాపారం చేయడం అంత సులభం కాదు. కొన్ని చట్టాలు, విధానాలవల్ల ఉత్పాదక వ్యయం పెరుగుతోంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగానికి ఆటంకంగాఉన్న అంశాలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తున్నా’ అని కెనిచి వ్యాఖ్యానించారు.
 
మోదీ అమెరికా పర్యటనలో ముకేశ్
 ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ముకేశ్ అంబానీ కూడా పాల్గొననున్నారు. గత నెల మోదీ జపాన్ పర్యటనలో కొన్ని అత్యవసర వ్యాపార కారణాల వల్ల ముకేశ్ పాల్గొనలేకపోయారు. సెప్టెంబర్ 28, 30 తేదీల్లో న్యూయార్క్, వాషింగ్టన్‌లలో ప్రధాని గౌరవా ర్థం నిర్వహించే డిన్నర్, రిసెప్షన్ కార్యక్రమాల్లో ముకేశ్ పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఇండియన్ అమెరికన్లు, ప్రవాసీయులు కూడా పాల్గొననున్నారు. 30న వాషింగ్టన్ ఆండ్రూ మెలాన్ ఆడిటోరియమ్‌లో రిసెప్షన్ కార్యక్రమాన్ని భారత్-అమెరికా వాణిజ్య మండలి(యూఎస్‌ఐబీసీ) నిర్వహించనుంది.

 15 నెలల్లో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు: ముకేశ్ అంబానీ
 మేకిన్ ఇండియాకు తన సంపూర్థ మద్దతు ఉంటుందని ముకేశ్ అంబానీ చెప్పారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)తో ఈ కార్యక్రమం సమర్థంగా అమలవుతుందన్నారు. ‘వచ్చే 12-15 నెలల కాలంలో రిలయన్స్ రూ.1.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను వెచ్చించనుంది. తద్వారా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నాం. మా కంపెనీ 140 దేశాలకు రూ.2.75 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను భారత్ నుంచి ఎగుమతి చేస్తోంది.

 మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే... ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడులు, నైపుణ్యాలు, సాంకేతికత పరిజ్ఞానాన్ని భారత్ అందిపుచ్చుకునేలా ద్వారాలు తెరవడం చాలా ముఖ్యం. ‘మేడ్’ ఇనేది గతం. ఇప్పుడు మన ప్రధాని 120 కోట్ల మంది దేశవాసులకు ఇచ్చిన ఈ నినాదం వర్తమానం.. భవిష్యత్తుకు సంబంధించినది. ఇందుకు మనమంతా కట్టుబడి ఉండాలి’ అని పేర్కొన్నారు.

  సవాళ్లను అధిగమించాలి: మిస్త్రీ
ప్రపంచ తయారీ కేంద్రంగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షలు నెరవేరాలంటే.. కొన్ని ప్రధాన సవాళ్లను ముందుగా పరిష్కరించాలి. దేశవ్యాప్తంగా కీలక మౌలికసదుపాయాల అభివృద్ధి, స్థిరమైన పాలసీలు, పారదర్శక, పోటీదాయక పన్నుల వ్యవస్థ, ఈ-గవర్నెన్స్ ఉపయోగంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలి’ అని సైరస్ మిస్త్రీ  చెప్పారు.

 ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్: నిర్మలా సీతారామన్
 తయారీ రంగాన్ని పరుగులు పెట్టించే చర్యల్లో భాగంగా తమ ప్రభుత్వం వ్యాపార వర్గాలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉందని వాణిజ్య,పరిశ్రమ, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా భారత్‌ను మళ్లీ అధిక వృద్ధిబాటలోకి వచ్చేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు భారత్ రెడ్‌కార్పెట్ పరుస్తుందని కూడా ఆమె హామీనిచ్చారు.

 అసంబద్ధ లెసైన్సింగ్ వ్యవస్థ, నియంత్రణల తొలగింపు దిశగా విప్లవాత్మక మార్పులకు కూడా కట్టుబడిఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా అనేది నినాదం కాదు. లక్ష్యం సాకారం దిశగా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జీడీపీలో తయారీ రంగం వాటాను ఇప్పుడున్న 15 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలనేది మా సంకల్పం’ అని సీతారామన్ వెల్లడించారు.

తయారీ రంగంలోనూ మన సత్తా చాటాలి: బిర్లా
 భారత్ ఇప్పటికే ఐటీ రంగంలో ప్రపంచ హబ్‌గా అవతరించింది. ఇప్పుడు తయారీ రంగంలో కూడా అంతర్జాతీయ కంపెనీలకు మన దేశాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దాల్సిన సమయం మేక్ ఇన్ ఇండియాతో సాకారమవుతుంది. ప్రస్తుతం దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 16 శాతంగా ఉంది. అదే చైనాలో ఇది 36 శాతం. దక్షిణ కొరియాలో 34 శాతం, జర్మనీలో 24 శాతంగా ఉన్నాయి. తయారీకి ప్రాధాన్యం పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంతోపాటు కోట్లాది ఉద్యోగాలను కూడా సృష్టించొచ్చని కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు.

 9 కోట్ల ఉద్యోగాలు: కొచర్
 దేశంలో భవిష్యత్తు వృద్ధికి ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చోదకంగా నిలుస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు. తయారీ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలన్న ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే.. వచ్చే పదేళ్లలో 9 కోట్ల ఉద్యోగాలు కొత్తగా జతవుతాయని అంచనా వేశారు.

 విజయానికి అందరూ కృషి చేయాలి:  ఆనంద్ మహీంద్రా
ప్రధాని మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దేశంలోని ప్రతిఒక్కరూ చేయూతగా నిలవాల్సిన అవసరం ఉంది.  భారత్‌ను ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా మార్చడంపై మనవంతు సహకారం ఎలా అందించాలన్నదానిపైనే అందరూ దృష్టిపెట్టాలి. ప్రభుత్వం ఆటోమొబైల్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలి. ముఖ్యంగా నియంత్రణ అడ్డంకులను తొలగించాలి.   కొత్తగా పెట్టుబడి పెట్టాలంటే భూమి, విద్యుత్, ఇలా అన్నీ ఇబ్బందులే. తయారీ రంగానికి ఇదే పెద్ద సమస్య అని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement