రేణిగుంట ప్లాంటులో మార్చికల్లా ట్యాబ్లెట్ పీసీల తయారీ
ప్రధానితో సెల్‌కాన్ సీఎండీ వై. గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటవుతున్న శ్రీవెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో తాము నెలకొల్పుతున్న ప్లాంటులో తొలుత ట్యాబ్లెట్ పీసీలు తయారుచేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. హబ్‌కు గురువారం ప్రధాని శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయనకు సెల్‌కాన్ ప్రణాళికల్ని గురు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సెల్‌కాన్ స్థానిక కంపెనీ అంటూ గురును మోదీకి పరిచయం చేశారు. ఈ హబ్‌లో సెల్‌కాన్ రావడంతో ఇత ర కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ప్రధానికి తెలిపారు.
దాంతో ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెల్‌కాన్ కంపెనీ సీఎండీ వై.గురును అభినందించారు. ‘ కొత్త ప్లాంట్‌లో మార్చికల్లా తొలి ఉత్పాదనను ఆవిష్కరిస్తాం. 2009లో కంపెనీని ప్రారంభించాం. హైదరాబాద్ ప్లాంటులో ట్యాబ్లెట్ పీసీల తయారీని సైతం మొదలు పెట్టాం’ అని మోదీకి ఈ సందర్భంగా గురు వివరించారు. ప్రధాని స్వ యం గా ప్లాంటుకు శంకుస్థాపన చేసి భుజం తట్టడం మరవలేని అనుభూతి అంటూ గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. హబ్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ సీఎం, ఉన్నతాధికారుల సహకారం ఉందన్నారు. ప్లాంటులో నెలకు 10 లక్షల ఫోన్లను తయారు చేస్తామని, రూ.200 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు. హైదరాబాద్ ప్లాంటులో నెలకు 3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.