తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకుతారు.
టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్ స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలా వుంటే ప్రధానమంత్రిగా మోదీ 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3వతేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోది తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించి అణువణువునా తనిఖీలు చేస్తూ భద్రత పటిష్ట పరిచారు.
మూడు వేల మందితో భద్రత
పీఎం, గవర్నర్, సీఎం రానుండడంతో తిరుమల, తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్ర««ధాన మంత్రి సెక్యూరిటీ ఎన్‌ఎస్‌జి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి పబ్లిక్ మీటింగ్ ప్రాంతం వరకు అక్కడ నుంచి తిరుమల వరకు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు ఎస్పీలు, ఏడుగురు అడిషనల్ ఎస్పీలు, 33 మంది డీఎస్పీలు, 77 మంది సీఐలు, 146 మంది ఎస్‌ఐలు, 1899 మంది సిబ్బందితో పాటు ఏపీఎస్పీ ఆర్మ్‌డ్Š ఫోర్స్ 200, స్పెషల్ పోలీసులు 300, గ్రేహౌండ్స్ 50 మందితో పాటు కూంబింగ్, బాంబ్ డిస్పోజల్ పార్టీలు తిరుమల ఘాట్‌లో, రేణిగుంట మార్గంలో తనిఖీలు నిర్వహించారు.
ప్రధాని పర్యటన వివరాలు:
►ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.
►4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
►4.40 గంటలకు విమానాశ్రయం దగ్గరగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకుంటారు.
►5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తిరుమల చేరుకుని దర్శనానికి వెళతారు.
►శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 7.20 గంటలకు రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి 8.10 గంటలకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా:
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.30 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు.
►దర్శనం అనంతరం తిరుమల నుంచి బయలుదేరి 8గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు.
►8.15 గంటలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన తర్వాత 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment