ఈ నెల చివర్లోనే కొత్త రూ.200 నోటు...
ఈ నెల చివర్లోనే కొత్త రూ.200 నోటు...
Published Wed, Aug 23 2017 8:44 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
సాక్షి, కోల్‌కత్తా : చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్ బ్యాంకు నోట్లు మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కొత్త రూ.200 బ్యాంకు నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చలామణిలోకి తీసుకు రాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు.
ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 200 రూపాయిల బ్యాంకు నోట్ల విడుదలకు ఇటు కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.200 నోట్లను ఆర్బీఐ జారీ చేయనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.
పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోస్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం మొట్టమొదటిసారి ఆర్బీఐ తీసుకొచ్చిన రూ.2000 బ్యాంకు నోట్లలో తీవ్రంగా బ్లాక్ మార్కెటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు, ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో గుట్టలుగుట్టలుగా ఈ నోట్లు బయటపడ్డాయి.
Advertisement
Advertisement