ఫలితాలు, గణాంకాలు కీలకం
► ఫ్రాన్స్‌ఎన్నికల ఫలితాలపై దృష్టి
► ఈ వారంలో పలు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు
► రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై ఇన్వెస్టర్ల చూపు
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఈ వారం వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలు, రిటైల్, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
అదివారం జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడానికే మొగ్గు చూపుతున్న ఇమాన్యుయేల్ మక్రాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు. అయితే యూరోజోన్‌కు వ్యతిరేకి అయిన లీ పెన్ గెలిస్తే మాత్రం మార్కెట్లు షాక్‌తింటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఫలితాల ప్రభావం...
ఇక ఈ నెల 12న ఏప్రిల్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. అదే రోజు మార్చి నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(మార్కెట్ ముగిసిన తర్వాత) కూడా వస్తాయి. కాగా ఆర్థిక ఫలితాలు వెల్లడి కావడం మొదలై ఇది ఐదోవారం. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు నిలకడగా, సానుకూలంగా ఉన్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థ రికవరీని సూచిస్తోందని నిపుణులంటున్నారు.
నేడు (సోమవారం) కెనరా బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు వస్తాయి. ఈ నెల 9న(మంగళవారం) భారతీ ఎయిర్‌టెల్, సిండికేట్ బ్యాంక్ ఫలితాలు, ఈ నెల 10న (బుధవారం) హీరో మోటొకార్ప్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఈ నెల 11(గురువారం) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, ఇక్రా, ఈ నెల 12న(శుక్రవారం) డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హావెల్స్ ఇండియా, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీల ఫలితాలు వస్తాయి.
ఒడిదుడుకులు ఉంటాయ్ !
ప్రస్తుత ఫలితాల సీజన్‌లో ఆర్థిక ఫలితాలకనుగుణంగా ఆయా కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని వివరించారు. ఆర్థిక ఫలితాలను జాగ్రత్తగా గమనించాలని, ఆర్థిక వ్యవస్థలోకి వృద్ధి తిరిగి వచ్చిందన్న అంచనాలను నిర్ధారణ చేసుకోవాలని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు.
ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి సంబంధిత గణాంకాలు ఈ వారంలో వస్తాయని, ఈ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఈ వారంలో చాలా ఈవెంట్స్ ఉన్నాయని, ఒడిదుడుకులు తప్పకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
హడ్కో ఐపీఓ ఈ వారంలోనే...
హడ్కో ఐపీఓ సోమవారం మొదలై బుధవారం ముగిస్తుంది. రూ.56–60 ధరల శ్రేణితో ఈ ఐపీఓ ద్వారా హడ్కో కంపెనీ రూ.1,200 కోట్లు సమీకరించనున్నది. ఇటీవలే ఐపీఓకు వచ్చిన ఎస్. చాంద్ అండ్ కంపెనీ మంగళవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కానున్నది. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, ఈ నెల 10న(బుధవారం) చైనా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ నెల 11న(గురువారం) బ్యాంక్ ఆఫ్ జపాన్ తన పాలసీని ప్రకటిస్తుంది. ఈ నెల 12(శుక్రవారవ) యూరప్ మార్చి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అదే రోజు అమెరికా ఏప్రిల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి.
విదేశీ ‘అమ్మకాలు’
గత కొన్ని రోజులుగా జోరుగా పెట్టుబడులు కొనసాగించిన విదేశీ ఇన్వెస్టర్లు గత వారంలో అమ్మకాలు జరిపారు. నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూ.1,700 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ముడి చమురు ధరలు పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు గత వారంలో మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.1,680 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్ మార్కెట్లో మాత్రం రూ.1,177 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కాగా గత మూడు(ఫిబ్రవరి–ఏప్రిల్) నెలల్లో రికార్డ్ స్థాయిలో రూ.40,000కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి.