మీ సురక్ష మా చేతుల్లో!
ఈఆర్పీ బటన్‌తో అత్యవసర సేవలు
► క్షణాల్లో అంబులెన్స్; బంధువులకూ సందేశం
► ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో సేవలు
► దశల వారీగా కర్ణాటక, తమిళనాడులకు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘కాల్ చేస్తే అంబులెన్స్’ ఇది సాధారణంగా మనకు తెలిసిందే. కానీ, కాల్ కూడా అవసరం లేదు.. జస్ట్ బటన్ నొక్కితే చాలు అంబులెన్స్ వచ్చేస్తుంది అంటోంది మీ సురక్ష. అంబులెన్సే కాదు దగ్గర్లోని బంధువులు, సన్నిహితులనూ అలెర్ట్ చేస్తామంటోంది కూడా. త్వరలోనే బీమా, డయాగ్నోస్టిక్ సేవలకూ విస్తరించనుంది. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న మీ సురక్ష. కామ్ సేవల గురించి సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎర్నెస్ట్ రోహిత్ కట్టా మాటల్లోనే..
మెట్రో నగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణం. మరి, ఇంట్లో ఒంటరిగా ఉండే పెద్దవాళ్ల సంగతేంటి? వారి ఆరోగ్యబాగోగులు ఎవరు చూసుకుంటారు? అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌కో, సమీప బంధువులకో సమాచారం అందించేదెవరు? స్వయంగా ఇలాంటి పరిస్థితిని అనుభవించిన రోహిత్.. ఈ అనుభవాన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాడు. ఇదే గతేడాది అక్టోబర్‌లో మీసురక్ష.కామ్ సంస్థకు బీజం వేసింది. ఎమర్జెన్సీ ప్యానిక్ రెస్పాన్స్ (ఈఆర్పీ) సొల్యూషన్స్‌తో అంబులెన్స్ సేవలందించడం అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో ప్రారంభించాం.
4 సెకన్లలో అంబులెన్స్..
మీసురక్ష.కామ్ సేవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఈఆర్పీలోని బటన్ నొక్కితే చాలు అంబులెన్స్‌కు, స్థానిక బంధువులు, స్నేహితులకు సమాచారాన్ని అందించడమే అంతే! ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 4,500–5,000 ఆసుపత్రుల సమాచారాన్ని మెడికల్ కౌన్సిల్ నుంచి సమీకరించాం.
అత్యవసర సమయాల్లో మొబైల్ అవసరం లేకుండానే ఈఆర్పీ మీదుండే బటన్ నొక్కితే చాలు అందులోని సిమ్ కార్డు యాక్టివేట్ అయి.. క్లౌడ్ ఆధారంగా 4 సెకన్లలో మీసురక్ష కాల్ సెంటర్‌కు ఫోన్ చేరుతుంది. వెంటనే అక్కడి సిబ్బంది దగ్గర్లోని అంబులెన్స్‌కు ఫోన్ చేసి పంపించేస్తారు. స్థానిక బంధువులు, స్నేహితులకూ సమాచారాన్ని చేరవేస్తుంది. అంబులెన్స్ ఆసుపత్రికి చేరేవరకూ ట్రాక్ చేస్తూనే ఉంటాం. అక్కడితో మీసురక్ష బాధ్యత పూర్తవుతుంది.
చైనా నుంచి దిగుమతి..
ప్రస్తుతం ఈఆర్పీ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి గోడలకు తగిలించుకునేలా, మణికట్టు ట్యాగ్, నెక్లెస్ ట్యాగ్ 3 రకాలుగా ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 3 రోజుల పాటు పనిచేస్తుంది. 3 నెలలు, ఏడాది రెండు రకాల సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. 3 నెలలకు రూ.5,044, ఏడాదికైతే రూ.12,226. ఈ ధరల్లో ఈఆర్పీ ఉత్పత్తి ధర కూడా కలిసి ఉంటుంది. రెండోసారి సబ్‌స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 70 శాతం ధర తగ్గుతుంది.
బీమా, డయాగ్నోస్టిక్‌లకు విస్తరణ..
ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. అంబులెన్స్ సేవల్లాగే బీమా, డయాగ్నోస్టిక్ సేవలనూ అందించాలని నిర్ణయించాం. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఏడాదిలో కర్ణాటక, తమిళనాడులకు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటివరకు రూ.15 లక్షల పెట్టుబడి పెట్టాం. ఈఆర్పీని జీపీఎస్‌తో అనుసంధానం చేసేందుకు మరో రూ.10 లక్షలు అవసరం. ఇందుకోసం పెట్టుబడుల కోసం చూస్తున్నాం.