మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్
ప్రత్యేకతలు...
5 గేర్లు ఉండే ఈ బైక్‌లో 24.5 బీహెచ్‌పీ పవర్‌ను ఇచ్చే ఇంజిన్, 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 21 అంగుశాల ముందు, 17 అంగుళాల వెనక టైర్లు, ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, సెమీ డిజిటల్, సెమి అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కంపాస్, గేర్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ హిమాలయన్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 411 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న ఈ బైక్ ధర రూ.1.55 లక్షలు(ఎక్స్ షోరూమ్, మహారాష్ట్ర) గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. ఐషర్ మోటార్స్ టూవీలర్ల విభాగమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ బుల్లెట్, క్లాసిక్, థండర్‌బర్డ్, కాంటినెంటల్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ హిమాలయన్ బైక్‌తో అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌ను సృష్టించామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ సిద్ధార్థ లాల్ చెప్పారు. భారత్‌లో అడ్వెంచర్ టూరింగ్‌ను ఈ హిమాలయన్ బైక్ తిరగరాస్తుందన్నారు. తాము అభివృద్ధి చేస్తున్న రెండు కొత్త ఇంజిన్ ప్లాట్‌ఫార్మ్‌లపై రూపొందించిన తొలి మోడల్ ఇదని వివరించారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లపై భవిష్యత్తులో మరిన్ని కొత్త మోడళ్లను తెస్తామని చెప్పారు. వీటి ఇంజిన్ కెపాసిటీ 250-750 సీసీ రేంజ్‌లో ఉంటుందని తెలిపారు.