13 వేల కోట్ల నల్లధనం వెలికితీత
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రంగా దాచుకున్న రూ. 13 వేల కోట్ల మొత్తాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు వెలికితీశారు. పన్నులు ఎగవేసి అక్రమంగా దాచుకున్నఈ నల్లడబ్బుల వివరాలను ఆదాయ పన్ను శాఖ అందించింది. ఇది కేవలం 2011, 2013లలో అందుకున్న రెండు సమాచారాలను బట్టే ఇంత భారీ మొత్తాన్ని వెలికితీయగలిగినట్టు వెల్లడించింది. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో 400 మంది భారతీయులు అక్రమంగా దాచుకున్న రూ. 8186 కోట్లను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ మొత్తంపై రూ.5377 కోట్ల పన్ను కట్టాలని ఐటి ఎసెస్ కమిటీ అంచనాలు చెబుతున్నాయి.
గతేడాది హెచ్ఎస్‌బీసీ నుంచి 623 మంది భారతీయుల అకౌంట్స్ వివరాలను ప్రభుత్వం అందుకుంది. అందులో 213 మంది ఖాతాలు నాన్ యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించింది. డబ్బులు లేకపోవడం లేదా. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఖాతాలు అయి ఉండొచ్చని భావించింది. 398 మంది అకౌంట్స్ ను మాత్రం గుర్తించగలిగామని, వాటిలో ఇంత భారీ మొత్తం ఉన్నట్టు ఐటీ శాఖ నివేదిక వెల్లడించింది
కాగా 2013లో ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జరనలిస్ట్ (ఐసీఐజె) వెబ్‌సైట్‌లో మరో 700 మంది భారీతీయులు అక్రమంగా 5 వేల కోట్లు దాచుకున్నారన్న సమాచారం కూడా లభించింది. వీరిలో ఇప్పటివరకు 55 మందిపై ఐటీ శాఖ కేసులు నమోదు చేయగా, హెచ్ఎస్‌బీసీ కేసులో 75 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.