చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అందించింది.

సాక్షి, న్యూఢిల్లీ : చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అందించింది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త రూ.200 నోటు రేపే మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో వీటిని శుక్రవారం మార్కెట్‌లలోకి లాంచ్ చేయనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ కరెన్సీ నోటు మార్కెట్‌లో ద్రవ్య సమస్యను, రూ.100 నోటుపై పడుతున్న భారాన్ని తగ్గించనుందని ఆర్‌బీఐ తెలిపింది. ''రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆగస్టు 25న రూ.200 డినామినేషన్ బ్యాంకు నోట్లను మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో మార్కెట్‌లోకి జారీచేస్తుంది. దీనిపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది'' అని ఆర్‌బీఐ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ సాంస్కృతిక పౌరసత్వాన్ని ప్రతిబింబించేలానే ఈ నోట్లను ఆర్‌బీఐ తీసుకొస్తుంది. ఈ నోటు బేస్ కలర్ బ్రైట్ ఎల్లో.