రూ. 981 కోట్ల విలువైన 7 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రూ.981 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటిల్లో హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్‌ఐపీబీ) సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
హాత్‌వే కేబుల్ అండ్ డేటా కామ్‌లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన సీలన్ ల్యాబొరేటరీస్ రూ.16 కోట్ల విదేశీ పెట్టుబడి ప్రతిపాదన ఆమోదం పొందింది. ఇటీవలనే ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ విదేశీ పెట్టుబడులను 55 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.