
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2025 నాటికి కొత్తగా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని ఒడిషా ప్రభుత్వం తెలిపింది. అలాగే 30 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నామని ఒడిషా పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ నితిన్ జవాలే వెల్లడించారు. నిర్ధేశిత లక్ష్యాన్ని గడువు కంటే ముందే చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఒడిషాలో పెట్టుబడి అవకాశాలు అన్న అంశంపై ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు, పెట్రో రసాయనాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, వాహనాలు, వాహన విడిభాగాల తయారీని ప్రధాన రంగాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు.