52 పైసలు బలపడిన రూపాయి
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం గురువారం 52 పైసలు బలపడింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో రూపాయి బలం పుంజుకోవడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్ మార్కెట్ లాభపడడంతో మూడు రోజుల రూపాయి నష్టాలకు తెరపడింది. విదేశీ మార్కెట్లో డాలర్ బలహీనపడడం కూడా కలసివచ్చిందని ఒక ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బుధవారం నాటి ముగింపు(68.07) తో పోల్చితే 67.85 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత మరింతగా బలపడి 52 పైసల లాభం(0.76 శాతం)తో 67.55 వద్ద ముగిసింది. అంతకు ముందటి మూడు రోజుల్లో రూపాయి 29 పైసలు నష్టపోయింది. అమెరికా సేవల రంగం ఆశించిన స్థాయిలో లేదన్న గణాంకాల కారణంగా డాలర్ భారీగా క్షీణించింది.