ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడుతుండటం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ప్రయోజనకరంగా ఉండగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. 2018–19లో సదరు సంస్థల లాభాలు 300–400 బేసిస్ పాయింట్లు పెరిగి 11–12 శాతం స్థాయిలో నమోదు కాగలవని అంచనా వేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇది 8 శాతమే.
కొత్త ఉత్పత్తులు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఎఫ్‌ఎంసీజీ రంగ లాభాల వృద్ధికి దోహదపడగలవని క్రిసిల్ తెలిపింది. కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) కేంద్రం పెంచడం, సానుకూల రుతుపవనాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర విభాగాల్లో ఉపాధి మెరుగుపడటం వంటి అంశాలతో ఆదాయాలు మెరుగుపడతాయని.. దీంతో వినిమయానికి డిమాండ్ పెరుగుతుందని వివరించింది.
‘ఎఫ్‌ఎంసీజీ రంగం మొత్తం ఆదాయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40–45 శాతం మేర ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం సానుకూల కారణాలతో ఈ విభాగం నుంచి ఆదాయాలు 15–16 శాతం పెరగొచ్చు. 2018లో ఇది 10 శాతమే‘ అని క్రిసిల్ తెలిపింది. ఇక పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ మాత్రం స్థిరంగా 8 శాతం మేర కొనసాగవచ్చని పేర్కొంది.
మధ్య స్థాయి సంస్థలకు మరింత సానుకూలం ..
జీఎస్‌టీ విధానంలో సమర్ధమంతంగా వ్యాపారాల నిర్వహణ కారణంగా మధ్య స్థాయి సంస్థల లాభాల వృద్ధి 15–17 శాతం మేర ఉండగలదని, పెద్ద సంస్థల లాభాలు 11–12 శాతంగా ఉండవచ్చని క్రిసిల్ నివేదికలో వివరించింది. మరోవైపు పోటీ, జీఎస్‌టీపరమైన అంశాల కారణంగా చిన్న కంపెనీలు ఒక మోస్తరు వృద్ధి మాత్రమే సాధించగలవని పేర్కొంది.
పెద్ద, మధ్య స్థాయి సంస్థలు ఇతర సంస్థల కొనుగోళ్లు, కొత్త ఉత్పత్తులతో వ్యాపార వృద్ధికి ప్రయత్నిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి చెప్పారు. పేరొందిన బ్రాండ్స్ ఉన్న చిన్న సంస్థలను కొంచెం ఎక్కువ వెచ్చించైనా సరే పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పుష్కలంగా నిధులుండటం, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తుండటం వంటి అంశాల కారణంగా ఇతర సంస్థల కొనుగోళ్లకు అవి కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టగలవని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment